breaking news
Microprocessors Manufacturing
-
వేలి గోరు సైజులో పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు!
కంప్యూటింగ్ రంగంలో మరో రికార్డు నమోదైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక మైక్రోప్రాసెసర్‌పై ఏకంగా పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు (100 బిలియన్) అమరిపోయాయి. నానోమీటర్ (మనిషి వెంట్రుక కంటే లక్ష రెట్లు తక్కువ సైజు) కంటే తక్కువ సైజున్న ట్రానిస్టర్లతో తయారైన ఈ మైక్రోప్రాసెసర్ సైజు మన వేలి గోరు సైజు మాత్రమే! కొన్నేళ్ల క్రితం రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో మైక్రోప్రాసెసర్‌ను సిద్ధం చేసిన ఐబీఎం తాజా ఆవిష్కరణతో తన రికార్డును తానే బద్దలు చేసింది. కంప్యూటర్ల మెదడుగా చెప్పుకునే మైక్రోప్రాసెసర్‌పై ఎన్ని ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటే వాటి వేగం అంత ఎక్కువగా ఉంటుంది. ట్రాన్సిస్టర్ల సంఖ్య, కంప్యూటర్ల వేగం రెండూ 18 – 24 నెలలకు ఒకసారి రెట్టింపు అవుతాయని 1965లోనే ఇంటెల్ వ్యవస్థాపకుడు గార్డన్ మూర్ లెక్కకట్టారు. 1971లో ఇంటెల్ అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ ‘ఇంటెల్ 4004’లో 2,300 ట్రాన్సిస్టర్లు మాత్రమే ఉండేవి. ఆ తరువాత మూర్స్ లా ప్రకారమే వీటి సంఖ్య, కంప్యూటర్ల వేగం పెరుగుతూ వచ్చింది. అయితే.. ట్రాన్సిస్టర్ల సైజు తగ్గుతున్న కొద్దీ సమస్యలూ పెరిగిపోయాయి. ప్రాసెసర్లు విపరీతంగా వేడెక్కిపోవడం ఇందులో ఒకటైతే విద్యుత్తు వినియోగమూ పెరగడం ఇంకోటి. ఈ నేపథ్యంలో వేగాన్ని పెంచుతూనే వేడిని తగ్గించేందుకు, మైక్రోప్రాసెసర్లలో వేర్వేరు కోర్లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఒక దశ దాటిన తరువాత ఈ టెక్నిక్ కూడా పనిచేయకుండా పోయింది. ఇక కంప్యూటర్ల వేగం పెరగదు అని అనుకునే లోపు ఐబీఎం ట్రాన్సిస్టర్లను ఒకదానిపై ఒకటి పేర్చడం మొదలుపెట్టింది. ఈ త్రీడీ అవతారమే తాజాగా అభివృద్ధి చేసిన ఒక నానోమీటర్ మైక్రోప్రాసెసర్! ఐదేళ్ల క్రితం ఐబీఎం అభివృద్ధి చేసిన మైక్రోప్రాసెసర్‌లో రెండు నానోమీటర్ల సైజు టాన్సిస్టర్లు 5,000 కోట్ల వరకూ ఉండేవి. వేగం 50 శాతం ఎక్కువ... పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లున్న తాజా మైక్రోప్రాసెసర్ రెండు నానోమీటర్లతో తయారైన దాని కంటే 50 శాతం ఎక్కువ వేగంతో పని చేస్తుందని, వాడుకునే విద్యుత్తు కూడా 70 శాతం వరకూ తక్కువని ఐబీఎం తెలిపింది. జనరేటివ్ ఏఐ సర్వీసులు మొదలుకొని మొబైల్‌ఫోన్లలోనే క్లౌడ్ సేవలతో పనిచేసేందుకు ఈ కొత్త మైక్రోప్రాసెసర్లు బాగా ఉపయోగపడతాయని తెలిపింది. తాము కేవలం ఎక్కువ ట్రాన్సిస్టర్లను అమర్చేందుకు మాత్రమే పరిమితం కాకుండా సిలికాన్‌తోపాటు వేర్వేరు ఇతర పదార్థాలను వాడటం ద్వారా ఈ ఘనతలు సాధించినట్లు ఐబీఎం తెలిపింది. ఇదంతా ఒక ఎత్తు. ఇంత సూక్ష్మస్థాయి మైక్రోప్రాసెసర్లను తయారు చేయడం ఇంకో ఎత్తు. తైవాన్ సెమీ కండక్టర్ దిగ్గజం టీఎస్ఎంసీ రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్లను గత ఏడాది నుంచే పెద్ద ఎత్తున తయారు చేయడం మొదలుపెట్టింది. ఐదేళ్ల క్రితం ఐబీఎం సిద్ధం చేసిన రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్ల ప్రాసెసర్ తయారీ రాపిడస్ ద్వారా వచ్చే ఏడాది తయారు కానుంది. ఆపిల్ కూడా టీఎస్ఎంసీ ద్వారా తన లేటెస్ట్ ప్రాసెసర్ ఎం6ను ఈ ఏడాదే తయారు చేయనుందని అంచనా. అంటే.. ఒక నానోమీటర్ ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్ మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకో ఐదారేళ్లు పడుతుందన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
గూగుల్, యాపిల్.. అంతా గప్పాలేనా?
యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, టెస్లా, బైడూ.. ఈ కంపెనీలకు ఏమైంది? ఒక పక్క చిప్‌ల కొరత, మరోపక్క సొంతంగా తయారు చేసుకుంటామని ప్రకటనలు. ఈ ప్రకటనలు ఆచరణలోకి వచ్చేది ఎప్పుడు?..అమలయ్యేది ఎప్పుడు? పాత ప్రకటనలను తెర మీదకు తెచ్చి.. కొత్తగా డబ్బా కొడుతున్న టెక్ కంపెనీలు ఎందుకంత హడావిడి చేస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలన్నీ సొంతంగా చిప్ తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయన్న వార్తలు ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్, యాపిల్లు ఈ రేసులో ముందున్నాయని, ‘గూగుల్‌బుక్ ల్యాప్‌ట్యాప్’ కోసం గూగుల్ సొంతంగా సీపీయూలను తయారు చేయడంలో చివరి దశకు చేరుకుందని ప్రకటనలు వెలువడుతున్నాయి. కానీ, ఏ లెక్కన చూసినా ఈ ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేది 2023 చివరికే. క్లిక్ చేయండి: ఫేస్ కాదు ఫేక్ బుక్ అయితే సొంత చిప్ తయారీ వ్యవహారం అంత సులువు కాదని, చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని టెక్ నిపుణులు చెప్తున్నారు. తాజాగా టీఎస్ఎంసీ కంపెనీ తైవాన్‌లో అత్యాధునిక చిప్‌ల ఫ్యాక్టరీ పెట్టనున్నట్లు ప్రకటించింది. సుమారు పది బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ ఫ్యాక్టరీ.. పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కోసం ఎన్నేళ్లు పడుతుందో కచ్చితంగా చెప్పడం లేదు. ఈ లెక్కన టెక్ దిగ్గజాలేవీ ఇప్పటికిప్పుడే చిప్ తయారీలోకి స్వయంగా దిగే అవకాశాలేవని, ప్రకటనలన్నీ ఉత్త ప్రకటనలేనని అభిప్రాయపడుతున్నారు. ఆగమేఘాల మీద ప్రకటనలు.. పీసీ, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, టీవీ, ఆటోమొబైల్స్ రంగాల్లో మైక్రోప్రాసెసర్ల(సెమీ-కండక్టర్)ను ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో వీటికి హై డిమాండ్ ఉంది. అయితే కరోనా టైం నుంచి చిప్ షార్టేజీ మొదలైంది. చాలా వరకు కంపెనీలు బాగా నష్టపోయాయి. ఆ ప్రభావంతో ఉత్పత్తి తగ్గి.. రేట్లు ఆకాశానికి అంటాయి. ప్రత్యేకించి కొన్ని బ్రాండ్లు ప్రొడక్టివిటీ ఉన్నా.. ఎక్కువ రేట్లకు అమ్మేస్తుండడంతో కంపెనీలకు అసహనం పెరిగిపోతోంది. అందుకే సొంతంగా చిప్ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. వరుసగా ఒక్కో కంపెనీలు చిప్ ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి. అయితే ఇలాంటి ప్రకటనల ద్వారా అవతలి కంపెనీలను దిగొచ్చి చేసే స్రా్టటజీ కూడా అయ్యి ఉండొచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. సొంత ఆలోచన మంచిదే ఒకవేళ కంపెనీలు నిజంగా సొంత చిప్ తయారీ రంగంలోకి అడుగుపెట్టినా.. అది మంచి ఆలోచనే అంటున్నారు ‘డైలాగ్ సెమీకండక్టర్’(యూకే) మాజీ బాస్ రస్ షా. ప్రస్తుతం మార్కెట్లో ఒకేరకమైన చిప్స్ ఉన్నాయి. ఇవి కాకుండా తమ డివైజ్‌లకు తగ్గట్లుగా చిప్స్ తయారీ చేసుకోవాలనేది టెక్ కంపెనీల ఉద్దేశం. తద్వారా డివైజ్‌ల సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్ కూడా వాళ్ల నియంత్రణలో ఉంటుంది. పైగా చీప్‌గా వర్కవుట్ అయ్యే వ్యవహారమని, డివైజ్‌లకు అందే ఎనర్జీని కూడా తక్కువగా తీసుకుంటుందని, స్మార్ట్ ఫోన్లు అయినా.. క్లౌడ్ సర్వీసెస్‌లకైనా ఒకేలా పని చేస్తాయని రస్ షా చెబుతున్నారు. పాత ప్రకటనలే! సొంత చిప్‌ల ప్రకటనలు వరుసగా చేస్తున్న బడా కంపెనీలు.. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. నిజానికి నవంబర్ 2020లోనే యాపిల్.. ఇంటెల్ ఎక్స్86 తరహా సొంత ప్రాసెసర్‌ను తయారు చేయబోతున్నట్లు ప్రకటించింది. కానీ, ఆ ప్రయత్నాలు అసలు మొదలుకాలేదు. ఇక టెస్లా ఏమో ఆరు నెలల కిందటే డేటా సెంటర్ల్లోని అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ కోసం ‘డోజో’ చిప్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించుకుంది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్లౌడ్ సర్వీసులు ఉన్న అమెజాన్.. నెట్వర్కింగ్ చిప్‌ను రూపొందించే పనిలో చాలాకాలం నుంచే ఉంది. ఫేస్బుక్ రెండేళ్ల క్రితమే అర్టిఫీషియల్ సొంత చిప్ ప్రకటన చేసింది. గూగుల్ కూడా సేమ్ ఇదే తీరు. ఒకవేళ నిజంగా వీళ్లు రంగంలోకి దిగినా.. డిజైనింగ్ వరకే పరిమితం అవుతారని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క కంపెనీ కూడా చిప్ తయారీ రంగంలోకి దిగే పరిస్థితులు లేవని కరాఖండిగా చెప్తున్నారు. ఒకవేళ ధైర్యం చేస్తే.. తడిసి మోపెడు అవ్వడం ఖాయమంటున్నారు. చదవండి: అసలు చిప్‌లు ఏం చేస్తాయి? వివాదాలు ఎందుకంటే.. -
మైక్రోప్రాసెసర్ల తయారీకి రెండు ఫౌండ్రీలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో రెండు అత్యాధునిక ఫౌండ్రీలు (మైక్రోప్రాసెసర్లకు అవసరమైన సిలికాన్‌ను శుద్ధీకరించే వ్యవస్థలు) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఏఈఎస్ఐ) అధ్యక్షుడు డాక్టర్ వి.కె.సారస్వత్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు కానున్న ఈ ఫౌండ్రీల కోసం ఇప్పటికే కొన్ని సంస్థలను గుర్తించామని, ఫైనాన్షియల్ క్లోజర్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఏఈఎస్ఐ హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన చిన్న, మధ్య తరహా సంస్థలు కేవలం విడిభాగాల తయారీకి పరిమితం కాకుండా తుది ఉత్పత్తులను తయారు చేయగలవిగా ఎదగాలని సూచించారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ టి.సువర్ణ రాజు మాట్లాడుతూ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రవాణా విమానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, 75-90 సీట్ల సామర్థ్యమున్న విమానం రూపకల్పన కోసం హెచ్ఏఎల్, ఎన్ఏఎల్ ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తున్నాయని తెలిపారు. కలాం సంస్మరణార్థం అనేక కార్యక్రమాలు: సతీశ్‌రెడ్డి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలను గుర్తుంచుకునేలా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) డెరైక్టర్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. డీఆర్డీవోలో కలాంతో కలసి పనిచేసిన శాస్త్రవేత్తలందరూ సోమవారం ఆర్సీఐలో సమావేశమై ఆయనకు నివాళులు అర్పించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మిస్సైల్ కాంప్లెక్స్‌కు ఆయన పేరు పెట్టడం వంటి సూచనలు అందుతున్నాయన్నారు.


