ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై ప్రభావం చూపుతున్న ఎల్‌నినో ఈ ఏడాది గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత బలంగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ అధిపతి హెచ్చరించారు. ఈ పరిణామం బ్రిటన్‌లోనూ వాతావరణ మార్పులకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శరదృతువు చివరి దశ, శీతాకాలం ప్రారంభంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు, తుపానులు సంభవించే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.
ఎల్‌నినో అనేది సహజంగా ఏర్పడే వాతావరణ దృగ్విషయం. భూమధ్యరేఖకు సమీపంలోని ఉష్ణమండల తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక సగటు కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా పెరిగినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కరవులు, తీవ్రమైన వేడి, తుపానులు, వరదల ముప్పు పెరగవచ్చు. ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం.. అక్టోబర్ నుంచి డిసెంబర్‌లో మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశముంది. ఎల్‌నినో బలపడుతోందనడానికి ఇది సంకేతమని సంస్థ పేర్కొంది.
భారత్‌లో ప్రభావం ఎక్కువ
ఎల్‌నినో ప్రభావం భారత్, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే దేశాల్లో ఎల్‌నినోకు సంబంధించి కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు ఇళ్లను విడిచి వెళ్లాల్సి వస్తుండగా, పశువులను ఎత్తైన ప్రాంతాలకు తరలించేందుకు పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండొనేషియాలోని బోర్నియో ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చులు కూడా ఈ ఏడాది సుదీర్ఘంగా కొనసాగుతున్న పొడి వాతావరణం కారణంగా మరింత తీవ్రమయ్యాయి. దీంతో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఒరంగుటాన్ కోతుల మనుగడకు ముప్పు ఏర్పడింది.
బ్రిటన్‌లో చలి తీవ్రత పెరుగుతుందా?
ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతానికి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటన్‌పై ఎల్‌నినో ప్రభావం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, వాయవ్య ఐరోపా, బ్రిటన్‌లో రాబోయే శరదృతువు చివరి దశ, శీతాకాలం ప్రారంభంలో వర్షాలు, తుపానులు పెరిగే అవకాశముందని బ్రిటన్ వాతావరణ శాఖ ఆగస్టులోనే వెల్లడించింది.
ఎల్‌నినో కారణంగా బ్రిటన్‌లో ఆకస్మికంగా ఉష్ణోగ్రతలు పడిపోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని రెడ్‌క్రాస్ హెచ్చరించింది. ఇలాంటి వాతావరణ మార్పులతో వరదలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, బలమైన గాలుల వల్ల నష్టం, మంచు కురిసే పరిస్థితులు తలెత్తవచ్చని తెలిపింది.
అయితే, ఎల్‌నినో ఒక్కటే నిర్దిష్ట తుపానులు, వరదలు లేదా చలి తీవ్రతకు ప్రత్యక్ష కారణం కాదని రెడ్‌క్రాస్ స్పష్టం చేసింది. ఈ దృగ్విషయం కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను పెంచుతుందని వివరించింది.
ధ్రువ ప్రాంతాల చల్లని గాలులతో ముప్పు
ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు వాతావరణంలో పై పొరల్లో ఉండే ధ్రువ ప్రాంతపు చల్లని గాలుల వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉందని బ్రిటన్ వాతావరణ శాఖ గతంలో హెచ్చరించింది. దీంతో ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చే గడ్డకట్టించే చల్లని గాలులు దక్షిణ దిశగా విస్తరించవచ్చు. అయితే, ఈ పరిణామం బ్రిటన్‌ను ప్రభావితం చేస్తుందా లేదా అనే విషయంపై ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అనేక అంశాలపై ఆధారపడే సాధ్యమైన పరిణామాల్లో ఒకటి మాత్రమేనని పేర్కొంది.
రాబోయే నెలల్లో ఎల్‌నినో తీవ్రత, సముద్ర ఉష్ణోగ్రతలు, వాతావరణ వ్యవస్థల్లో మార్పులను నిపుణులు నిశితంగా పరిశీలించనున్నారు. వీటి ఆధారంగానే బ్రిటన్‌లో శీతాకాలం ఎంత చల్లగా ఉండవచ్చు, భారీ వర్షాలు లేదా మంచు కురిసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


