ఒక్క ఎల్‌నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది! | El Nino Drought Devastates Farmer Livelihood but She Fights Back | Sakshi
Sakshi News home page

ఒక్క ఎల్‌నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!

Oct 19 2026 9:19 PM | Updated on Oct 19 2026 9:30 PM

El Nino Drought Devastates Farmer Livelihood but She Fights Back

ఎల్‌నినో ప్రభావంతో వచ్చే కరువు రైతుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. పెంచుకున్న పశువులన్నీ మృత్యువాత పడటం, నీరు లేక పంటలు పంటడకపోవడం వంటి అనేక దుర్భర పరిస్థితులు ఎదురవుతాయి. వాతావరణ మార్పుల సవాళ్ల మధ్య రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎల్‌నినో కొందరి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో, అయినప‍్పటికీ ఎలా నిలదొక్కుకోవాలో మధ్య అమెరికా దేశమైన హోండురాస్‌కు చెందిన  ఓ మహిళా రైతు కథను తెలుసుకుంటే అర్థమవుతుంది.  2023లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర కరవు వెయ్యికి పైగా పశువుల ప్రాణాలను బలిగొంది. ఒలాంచిటో పట్టణానికి చెందిన మహిళా రైతు మిలెక్సీ రోడ్రిగ్జ్‌ తన పశువులన్నింటినీ కోల్పోయారు. అయితే, బావి తవ్వకం, నీటిపారుదల సదుపాయాల కోసం రుణాలు తీసుకుని వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించిన ఆమె.. ఇప్పుడు పాలు, మిరపకాయలు, మొక్కజొన్న సాగుతో పాటు పందుల పెంపకం, తేనెటీగల పెంపకంపైనా దృష్టి సారించారు.

పశువుల పెంపకంలో మహిళగా ఎదురైన శారీరక శ్రమతో పాటు సామాజిక వివక్షను కూడా రోడ్రిగ్జ్‌ ఎదుర్కొన్నారు. సొంత భూమి సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఒకే ఒక్క ఆవుతో ప్రారంభించిన ఆమె ప్రయాణం.. 2023 కరువుతో తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ, ఆ అనుభవం ప్రకృతి విపత్తులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని నేర్పిందని ఆమె పేర్కొన్నారు.

233 ప్రాంతాలకు కరవు హెచ్చరికలు 
ప్రస్తుతం హోండురాస్‌లో పరిస్థితులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. మొత్తం 298 మున్సిపాలిటీల్లో 233 ప్రాంతాలకు కరవు హెచ్చరికలు జారీ చేశారు. వీటిలో 100కు పైగా ప్రాంతాల్లో అత్యంత తీవ్రస్థాయి హెచ్చరికలు అమల్లో ఉన్నాయి. వర్షాల కొరతతో పంటలు దెబ్బతింటున్నాయి. పశువులకు తగినంత మేత, నీరు అందడం లేదు. ఈ కరవు వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చని అంచనాలున్నాయి. 2023 తర్వాత తన వ్యవసాయ క్షేత్రాన్ని మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దుకోవడానికి రోడ్రిగ్జ్‌ రెండు రుణాలు తీసుకున్నారు.

వాటితో బావి తవ్వించి, నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఎండాకాలానికి ముందే పశువుల మేతను పండించి నిల్వ చేసుకునే అవకాశం లభించింది. హీఫర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కూడా పశువుల మేత అందించడంతో పాటు తేనెటీగల పెంపకానికి సహకరిస్తోంది. ఈ మార్పుల వల్ల తన పిల్లలను పెంచి, వారికి విద్య అందించగలిగానని ఆమె తెలిపారు. వ్యవసాయం పురుషులకే పరిమితమనే అభిప్రాయం తప్పని, మహిళలకూ సామర్థ్యం, పట్టుదల ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

అయితే, ఇలాంటి సహాయం అందరికీ అందుబాటులో లేదు. హోండురాస్‌లో ఇప్పటికే 18 లక్షల మంది తీవ్రస్థాయి ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. తాజా పంట నష్టాలు ఈ పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. మహిళా రైతులకు శిక్షణ, నీటిపారుదల సదుపాయాలు, కరవు ప్రణాళికలు, ప్రత్యామ్నాయ వ్యవసాయ మార్గాలపై మద్దతు అవసరమని రోడ్రిగ్జ్‌ అభిప్రాయపడ్డారు. విపత్తు సంభవించిన తర్వాత స్పందించడమే కాకుండా, ముందుగానే రైతులను సిద్ధం చేసే విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో, రైతుల జీవనోపాధిని కాపాడటంలో దీర్ఘకాలిక ప్రణాళికలు, నీటి వనరుల అభివృద్ధి కీలకంగా మారనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement