తెలంగాణలో కరెంటు కష్టాలు రానురాను పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై సీరియస్గా స్పందించారు. రైతులకు సరిగా విద్యుత్ సరఫరా కాకపోతే ఐఎఎస్లపై కూడా చర్య తీసుకుంటానని హెచ్చరించారు. నిజానికి ఈ కరెంటు సంక్షోభం రావడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న ఎల్నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర కొన్ని రాష్ట్రాలపై అధికంగా కనిపిస్తోంది. వర్షాలు సరిగా కురవకపోవడం సంక్షోభంగా మారింది. మహారాష్ట్రలో పుణే నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నీటిని దుర్వినియోగం చేస్తే ఐదువేల రూపాయల జరిమానా విధిస్తామని కొన్ని నగరాలలో అధికారులు ప్రకటనలు చేస్తున్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు ఆయా జిల్లాలలో జరుగుతున్న కార్యక్రమాలలో రైతులకు, ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నారు. వచ్చే అక్టోబర్ వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, తాగునీటి సంక్షోభం కూడా వస్తుందని వారు చెబుతున్నారు. నీటి వినియోగం అధికంగా ఉండే యాసంగి పంటలు వేయవద్దని సలహా ఇస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ కు ఒకప్పుడు తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. కాని ఆయా ప్రభుత్వాలు కృష్ణా, గోదావరి నుంచి నీటిని రప్పించే స్కీముల వల్ల చాలావరకు మెరుగు అయింది. అయినా ఈసారి హైదరాబాద్లో కూడా తాగునీటి గండం ఉందని చెబుతున్నారు.
వ్యవసాయానికి సంబంధించి, గోదావరి నది మట్టం బాగా దిగువన ఉండడంతో ప్రాజెక్టుల నిర్మాణం కష్టసాధ్యం అయింది. తెలంగాణలో బోరుబావులపై ఆధారపడి జరిగే వ్యవసాయం కూడా చాలా ఎక్కువే. సుమారు 90వేల బోర్లు పనిచేస్తున్నాయి. కాని బోర్లు పనిచేయాలంటే విద్యుత్ సరఫరా సజావుగా ఉండాలి. లేకపోతే పంటలకు నీరు అందక దెబ్బతింటాయి. ఇప్పటికే ఆ పరిస్థితులు పలు చోట్ల ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా కాల్వల ద్వారా నీరు వస్తుంటే, ఆయా గ్రామాల రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు చేసి ప్రత్యామ్నయ చర్యలపై ఆదేశాలు ఇస్తున్నారు. ఆ క్రమంలో పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ అందించాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే 20 రోజులు కీలకం అని ఆయన అన్నారు.
ఎల్నినో ప్రభావాన్ని రేవంత్ కరోనా సమస్యతో పోల్చారు. ముఖ్యమంత్రి సమీక్షలు ఎలా ఉన్నా, ఆదేశాలు ఎంత గట్టిగా ఉన్నా ఆయా ప్రాంతాలలో కరెంటు కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నయో తెలిపే కథనాలు మీడియాలో వస్తున్నాయి. రైతులు జనరేటర్లు పెట్టుకుని బోర్లను నడిపించుకోవల్సి వస్తోంది. దీని వల్ల అదనపు వ్యయాన్ని భరించవలసి వస్తోంది. కొన్ని చోట్ల టాంకర్ల నీటితో పొలాలను తడుపుకుంటున్నారు. కొందరు రైతులు తమ పాట్లను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. దీనివల్ల బియ్యం ధరలు బాగా పెరిగి సామాన్యులు కూడా కష్టాలపాలవుతారు.
గత ఏడాది ఇదే సీజన్ లో 15,906 మెగావాట్ల డిమాండ్ ఉంటే, ఈ ఏడాది ప్రస్తుతం అది ఏకంగా 19వేల మెగావాట్లకు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి కీలకమైనప్రాజెక్టులలో నీటి మట్టం పడిపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మరోవైపు యాదాద్రి వంటి ధర్మల్ ప్రాజెక్టులు పూర్థి స్థాయిలో పనిచేయడం లేదని చెబుతున్నారు. రైతులకు విద్యుత్ సరఫరా చేయడానికి ఎదురవుతున్న ఆటంకాలను ప్రభుత్వం గుర్తించాలి. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేకపోతే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా పెద్దగాప్రయోజనం ఉండదు. విద్యుత్ కొనుగోలు చేయడానికి కూడా దొరకడం లేదని స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పారు. అలాంటప్పుడు అధికారులు చేయగలిగింది ఏమి ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పటికే పలుచోట్ల విద్యుత్ కోతలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వవలసి ఉంటుంది. పూర్తిగా విద్యుత్ను అందుకు కేటాయిస్తే ఆర్థికంగా పెద్ద సమస్యలే వస్తాయి. అందువల్ల బాలెన్స్ చేసుకోవలసి ఉంటుంది.
హైదరాబాద్ వంటి నగరంలో విద్యుత్ సరఫరాలో కోతలు ఎక్కువగా ఉంటేప్రభుత్వంపై విమర్శలు తీవ్రంగా వస్తాయి. దీనిని కూడా ప్రభుత్వం సహజంగానే పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సందర్బంగా కొన్ని విషయాలు ప్రస్తావించాలి. ఉమ్మడి ఏపీని విభజించి తెలంగాణను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేకిస్తూ పలు ప్రజెంటేషన్లు ఇచ్చారు. విడిపోతే తెలంగాణకు సాగునీరు, విద్యుత్ సమస్య వస్తుందన్నది కీలకమైనది. అప్పట్లో తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ తదితరులు ఆయన వాదనను తీవ్రంగా ఖండించారు.
ఇదీ చదవండి: రాహుల్గాంధీవి దింపుడు కల్లం ఆశలే
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వ్యూహాత్మకంగా విద్యుత్ , సాగునీరులపై బాగా దృష్టి పెట్టారు. అందులో కొన్ని విమర్శలు వచ్చినా, తెలంగాణ ఏర్పడిన కొద్దికాలానికే 24 గంటలు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసే స్థితికి తీసుకువచ్చారు. దానికి ముఖ్యకారణం ఛత్తీస్గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో గ్రిడ్ ఏర్పడడం కూడా ఉపయోగపడింది. యాదాద్రి పవర్ ప్లాంట్ వంటివాటిని నిర్మించారు. అదే టైమ్లో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును భారీ స్థాయిలో చేపట్టారు. లక్ష కోట్లకు పైగా వ్యయంతో దీనిని నిర్మించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్లింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పలు రిజర్వాయర్లను నిర్మించారు. ఎత్తిపోతల ద్వారా నీటిని ఈ రిజర్వాయర్లలోకి తరలించారు. అయితే ఈ విషయాలలోను తర్వాత కాలంలో ఆరోపణలు రావడం, కేసీఆర్ రాజకీయంగా కొంత నష్టపోవడం కూడా జరిగిందని చెప్పాలి.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో, యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించేది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిపై విచారణకు కూడా ప్రయత్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఒక పిల్లర్ కుంగింది. దాంతో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పవర్ లోకి రావడంతో ఒక కమిషన్ వేసి విచారణ చేయించింది. అవేమీ కొలిక్కి రాలేదు. ఇవన్ని ఒక రాజకీయ గేమ్గా మిగిలాయి. అయితే పిల్లర్ కుంగడం పెద్ద సమస్యకాదని, ప్రాజెక్టులకు ఇలాంటివి జరుగుతుంటాయని, కాని కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మరమ్మతు చేయకుండా జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కారణం ఏమైనా రేవంత్ ముఖ్యమంత్రి అయి మూడేళ్లయినా, కాళేశ్వరం ప్రాజెక్టు డామ్ రిపేర్లను ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు. ఫలితంగా గోదావరికి వరద వచ్చినా ఆ నీటిని మోటార్ల ద్వారా తోడి ఈ రిజర్వాయర్లలోకి పెట్టలేకపోయారు. అందువల్లే నీటి సంక్షోభం అధికంగా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
తెలంగాణలో ఎల్నినో వల్ల వచ్చిన కరువు కాదని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు ఆరోపిస్తున్నారు. ఏపీతో సహా వివిధ రాష్ట్రాలలో కరువు ఎలా వచ్చిందని కాంగ్రెస్ ఎదురు ప్రశ్నిస్తోంది. ఇప్పటికే సుమారు 300 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కరువు సహాయ చర్యలుచేపట్టడానికి కేవలం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం వనరులే సరిపోవు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎల్నినో ప్రభావిత రాష్ట్రాలకు సహాయపడడానికి ముందుకు రావాలి. కరువుపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా తక్షణమే రైతులను, రైతు కూలీలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ముందుకు రావాలి. లేకుంటే తెలంగాణలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పాలి.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


