రాహుల్‌గాంధీవి దింపుడు కల్లం ఆశలే | Union Minister Kishan Reddy Slams Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌గాంధీవి దింపుడు కల్లం ఆశలే

Oct 17 2026 5:35 AM | Updated on Oct 17 2026 5:35 AM

Union Minister Kishan Reddy Slams Rahul Gandhi

10 నెలల్లో మోదీ ప్రభుత్వాన్ని కూలుస్తానన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా 

రాహుల్‌కు దమ్ముంటే ప్రజాదరణతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టి చూపాలని సవాల్‌ 

ప్రతిపక్షాల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేసినంత మాత్రాన కేంద్రం భయపడినట్లు కాదని స్పష్టికరణ 

సీఎం, డిప్యూటీ సీఎం కోరినట్లుగా రాష్ట్రానికి విద్యుత్‌ కొరత రాకుండా బొగ్గు కేటాయిస్తామని హామీ

సాక్షి, హైదరాబాద్‌: శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని కూలి్చనట్లుగానే భారత్‌లోనూ ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని రాహుల్‌ గాంధీ దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 10 నెలల్లో మోదీ ప్రభుత్వాన్ని కూల్చే బాధ్యత తనదని రాహుల్‌ గాంధీ అంటున్నారని ఆరోపించారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షాల డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేసిందని.. అంతమాత్రాన తమ ప్రభుత్వం భయపడినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.

2029 వరకు ప్రధానిగా మోదీ ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని.. రాహుల్‌ గాందీకి దమ్ము, ధైర్యం ఉంటే ప్రజాదరణతో ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి చూపాలని సవాల్‌ విసిరారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇంత బాధ్యతారాహిత్యమైన, బలహీనమైన నకిలీ ప్రతిపక్ష నేతను దేశం ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థలను నిరీ్వర్యం చేసేందుకు, ఎన్నికల కమిషన్‌పై బురదజల్లేందుకు రాహుల్‌ గాంధీ నిరంతరం ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పారీ్టలు, ప్రభుత్వాలు రావచ్చు.. పోవచ్చుగానీ వ్యవస్థలను నాశనం చేయకూడదన్న ఇంగితం రాహుల్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఈవీఎంలు, సర్‌పై ఇవేం మాటలు? 
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను బెదిరిస్తూ రాహుల్‌ గాంధీ దాదాగిరి భాష మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే దానికి బాధ్యత ఎన్నికల కమిషనర్‌ వహించాలా అని ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ గెలిస్తే ఈవీఎంలు, ఈసీని మెచ్చుకొని.. కేరళంలో గెలిస్తే ‘సర్‌’మంచిదని సరి్టఫికెట్లు ఇచ్చే కాంగ్రెస్‌.. బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు, ఈసీదే తప్పని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఓట్ల చోరీ ఎక్కడా జరగలేదని, దొంగలకు ప్రజలే ఓటు వేయట్లేదన్న వాస్తవాన్ని రాహుల్‌ గాంధీ గ్రహించాలని చురకలంటించారు. అంతర్జాతీయ డీప్‌ స్టేట్, విద్రోహ శక్తుల కుట్రలు, ప్రపంచ శక్తులు ఏకమైనా మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని వ్యాఖ్యానించారు. 

‘యాదాద్రి’కి కేంద్రం అండ... 
సింగరేణిలో ఉత్పత్తి తగ్గుదలతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని.. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత రాకుండా కోల్‌ ఇండియా నుంచి బొగ్గు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనను కోరారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బిడ్డగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్‌ కొరత రాకుండా యాదాద్రి ప్లాంట్‌కు తప్పకుండా బొగ్గు సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశానని.. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ లేదా వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి తక్షణమే బొగ్గు అందిస్తామని స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement