ట్రంప్‌ ‘గోల్ఫ్‌’ పంచాయితీ.. అధ్యక్షునికి షాకిచ్చిన హైకోర్టు! | After Kennedy Center and reflecting pool disputes | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ‘గోల్ఫ్‌’ పంచాయితీ.. అధ్యక్షునికి షాకిచ్చిన హైకోర్టు!

Oct 19 2026 8:00 AM | Updated on Oct 19 2026 8:00 AM

After Kennedy Center and reflecting pool disputes

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని శతాబ్దాల చరిత్ర కలిగిన ‘ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్’ను సమూలంగా ఆధునీకరించే ప్రణాళికను ప్రకటించారు. ట్రూత్ సోషల్‌లో కొత్త 18-హోల్ డిజైన్ నమూనాను షేర్‌ చేసి ఆయన, ఈ పనులు నవంబర్‌లో ప్రారంభమవుతాయని వెల్లడించారు. పునర్నిర్మాణం పూర్తయ్యాక ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు, యూఎస్ ఓపెన్, పీజీఏ ఛాంపియన్‌షిప్, రైడర్ కప్ వంటి అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లు నిర్వహించేందుకు వీలుగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటికే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గోల్ఫ్ కోర్స్‌లోని వందలాది చెట్లను రాత్రికి రాత్రే నరికివేయడంపై ఫెడరల్ జడ్జి అనా రెయెస్ ట్రంప్ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న కారణంతో అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులను విచారణకు హాజరుకావాలని ఆదేశించగా, ఆ న్యాయమూర్తి తమ ప్రభుత్వంపై పక్షపాతం చూపుతున్నారని ఆరోపిస్తూ కేసు నుంచి తప్పుకోవాలని ట్రంప్ బృందం కోరింది.

మరోవైపు ప్రస్తుతం ఉన్న మైదానం శిథిలావస్థకు చేరిందని, తెగులు పట్టిన చెట్లు, దెబ్బతిన్న తీరప్రాంత గోడల స్థానంలో నూతన నిర్మాణం అవసరమని ట్రంప్ సమర్థించుకున్నారు. పొటోమాక్ నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ మైదానం చుట్టూ వాకర్లు, సైక్లిస్టులు, చేపలు పట్టేవారు. పిక్నిక్ చేసుకునే సామాన్య పౌరుల కోసం రహదారులు, బాటలు ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతిపాదించిన సరికొత్త డిజైన్‌లో ఈ బహిరంగ ప్రదేశాలను తొలగించినట్లు కనిపిస్తుండటంతో, సాధారణ ప్రజలకు ఈ ప్రాంత ప్రవేశంపై తీవ్ర ఆంక్షలు ఎదురవుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రక ప్రజా ఆస్తిని విలాసవంతమైన క్రీడా ప్రాంగణంగా మార్చడంపై స్థానిక పౌరులు, పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని వాషింగ్టన్ రూపురేఖలను మార్చేందుకు ట్రంప్ చేపడుతున్న వివాదాస్పద ప్రాజెక్టులలో ఇది కూడా భాగం. గతంలో వైట్ హౌస్ ఈస్ట్ వింగ్‌ను కూల్చివేసి కొత్త బాల్రూమ్ నిర్మించడం, ట్రయంఫల్ ఆర్చ్ నిర్మాణం, అలాగే కెన్నెడీ సెంటర్‌ను మార్చే ప్రయత్నాలు ఇప్పటికే న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. అంతేకాకుండా, 14.7 మిలియన్ డాలర్లతో చేపట్టిన లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ మరమ్మతులు కూడా నాణ్యతా లోపాలు, ఆల్గే సమస్యతో తీవ్ర విమర్శలపాలయ్యాయి. ఈ క్రమంలో గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టు సైతం చెట్ల నరికివేత, ప్రజా హక్కుల విషయంలో మరింత న్యాయ పరిశీలనను ఎదుర్కొంటోంది. 

ఇదీ చదవండి: ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement