
చూడచక్కని జంట. ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.
యారోన్, సారా.. ఇద్దరూ ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది. బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లోని యూదుల మ్యూజియం వద్ద జరిగిన వేడుకలో కలిసే పాల్గొన్నారు. అయితే ఓ దుండగుడు అత్యంత సమీపంగా నలుగురు ఉన్న బృందంపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఈ ఇద్దరే మరణించారు. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే.. త్వరలో ఆ యువకుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడని!
యారోన్, సారా మంచి మిత్రులు మాత్రమే కాదు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు కూడా. వచ్చే వారం జెరూసలేంలో సారాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయాలని యారోన్ సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరిగింది. ఎంతో జీవితం ఉన్న ఆ యువ జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధాకరం అని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచెయిల్ లెయిటర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉగ్రదాడిలో యువ జంట మరణించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాల్పుల ఘటన తర్వాత దుండగుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశాడు. అతన్ని చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్జిగూజ్‌గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఇలాంటివి అమెరికాలో కుదరవు-ట్రంప్