
అమెరికలో దౌత్య పరమైన విషాదం నెలకొంది. ఓ ఆగంతకుడు జరిపిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ(Israel Embassy Staff) సిబ్బంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్లను హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చారు.
స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని యూదుల మ్యూజియం(Jewish Museum) వద్ద ఈ ఘోరం జరిగింది. మ్యూజియంలో ఓ ఉత్సవం జరుగుతుండగా.. ఎంబసీ స్టాఫ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. అంతలో.. అత్యంత సమీపం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనలో సిబ్బంది ఇద్దరు మరణించారు.
కాల్పులకు పాల్పడ్డ దుండగుడు పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ‘‘ ఫ్రీ పాలస్తీనా.. ఫ్రీ పాలస్తీనా(Free Palestine) ’’ అంటూ జెండా కప్పేసుకుని అక్కడే కూర్చుని నినాదాలు చేశాడు. దీంతో ఉగ్రదాడి కోణంలోనే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణతో.. గాజాలో తీవ్ర దాడులు(Gaza War) జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతుండటంతో పాలస్తీనీయులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ పరిణామాల వేళ.. కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మరోవైపు.. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
“These horrible D.C. killings, based obviously on antisemitism, must end, NOW! Hatred and Radicalism have no place in the USA. Condolences to the families of the victims. So sad that such things as this can happen! God Bless You ALL!” —President Donald J. Trump pic.twitter.com/Z30bjAQOpZ
— The White House (@WhiteHouse) May 22, 2025
జెవిష్ మ్యూజియం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అమెరికాలో ద్వేషానికి, ఉగ్రవాదానికి చోటు లేదని.. యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న భయంకరమైన ఈ తరహా దాడులు, హత్యలు తక్షణమే ఆగాలని హెచ్చరించారాయన. మరోవైపు ఘటనపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇతర దేశాల్లోని ఎంబసీలను మాత్రం అప్రమత్తం చేసినట్లు సమాచారం.