
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) సంచలన ప్రకటన చేశారు. హమాస్ నేత ముహమ్మద్ సిన్వార్‌ను తమ సైన్యం చంపివుండవచ్చని పేర్కొన్నారు. జెరూసలేంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు .. గాజాలో 20 మంది బందీలు బతికే ఉన్నారని, 38 మంది వరకూ మరణించి ఉంటారని, అక్కడ చిక్కుకున్న బందీలను త్వరలోనే తీసుకువస్తామని ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు హామీ ఇచ్చారు.
గాజాలో తమ సైనిక లక్ష్యాల కోసం నిర్మాణాత్మక ప్రణాళిక కొనసాగుతున్నదని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే తాము పదివేల మంది ఉగ్రవాదులను తదముట్టించామని, హమాస్ నేతలు డీఫ్, హనియే, యాహ్యా సిన్వార్, మొహమ్మద్ సిన్వార్ నాయకులను అంతమొందించామని నెతన్యాహు చెప్పినట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది.
ఇజ్రాయెల్(Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో సైనిక కార్యకలాపాలను విస్తరించడాన్ని యూకే, ఫ్రాన్స్, కెనడాలు తప్పుపట్టాయి. కాగా హమాస్‌పై సంపూర్ణ విజయం సాధించడానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని నెతన్యాహు పునరుద్ఘాటించారు. ఇది అనాగరికతపై నాగరికతా యుద్ధమని, దీనిలో పూర్తి విజయం సాధించే వరకు ఇజ్రాయెల్ న్యాయపరమైన మార్గాల ద్వారా తనను తాను రక్షించుకుంటూనే ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు. పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడి, 1,200 మంది అమాయకులను హత్య చేసి, 250 మందికి పైగా అమాయకులను గాజాలో బంధించిన నేపధ్యంలో ఈ యుద్ధం ప్రారంభమైందని నెతన్యాహు గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ