
మానవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
అక్రమ వలసలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదు
అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్పదేశంగా మారుస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో అమెరికాలో ఉంటున్న భారతీయుల బెంబేలెత్తిపోతున్నారు. ఎవరిని ఎప్పుడు వెళ్లగొడతారో తెలియక హడలిపోతున్నారు. అక్రమ వలసదారుల పేరిట 300 మంది భారతీయులను ఇటీవల అమెరికా నుంచి వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే.
అమెరికాలోకి భారతీయులు అక్రమంగా అడుగుపెట్టడానికి ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లే ధనదాహమే కారణమని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అందుకే సదరు ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. ‘‘అమెరికాకు భారతీయులను అక్రమంగా పంపిస్తున్న ఏజెంట్లను గుర్తించే పనిలో మిషన్ ఇండియాకు సంబంధించిన కాన్సులర్ అఫైర్స్ అండ్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది నిమగ్నమయ్యారు. మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం’’అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అక్రమాలకు పాల్పడుతున్న ఇండియన్ ట్రావెల్ ఏజెన్సీల యజమానులు, ప్రతినిధులపై వీసా ఆంక్షలు విధించడానికి చర్యలు చేపట్టామని స్పష్టంచేసింది. ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన వలసలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని తేలి్చచెప్పింది. మనుషుల స్మగ్లింగ్ అనేది పెద్ద నేరమని వెల్లడించింది. అమెరికాకు రావాలనుకుంటే ముందు తమ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని విదేశీయులకు సూచించింది. చట్టాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అక్రమంగా వలస వచ్చినవారికే కాకుండా.. అలా రావడానికి సహకరించిన వారికి కూడా శిక్షలు ఉంటాయని ఉద్ఘాటించింది.
హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
మరోవైపు హెచ్–1బీ వీసాలపై అమెరికాలోని అతివాదుల దృష్టి పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి వీసాలను ఎందుకు రద్దు చేయకూడదని అధికార డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారు లారా ఎలిజబెత్ లూమర్ ప్రశ్నించారు. చట్టపరమైన ఈ తాత్కాలిక వర్క్ వీసాలతో భారతీయులు ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలంటూ ట్రంప్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ వాదనలు వినిపిస్తున్నారు. ‘‘అక్రమ వలసదారులను బయటకు పంపిస్తున్నాం, బాగానే ఉంది.. మరి హెచ్–1బీ వీసాదారుల సంగతేమిటి?’’అని లారా ఎలిజబెత్ లూమర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘‘హెచ్–1బీ వీసాల కుంభకోణాన్ని ట్రంప్ ప్రభుత్వం అడ్డుకోకపోతే కోట్లాది మంది అమెరికన్లకు అసంతృప్తే మిగులుంది’’అని మరో పౌరుడు పోస్టు చేశాడు. గత 30 ఏళ్లుగా కుంభకోణం జరుగుతోందని ఆరోపించాడు. టెక్నాలజీ కంపెనీలు ఈ స్కామ్‌ను అడ్డం పెట్టుకొని వందల కోట్ల డాలర్లు ఆర్జించాయని విమర్శించాడు. అవే కంపెనీలు 2020లో ట్రంప్‌ను ఓడించాయని చెప్పాడు. అమెరికన్ల ప్రయోజనాలను పణంగా పెట్టి టెక్ కంపెనీలకు ట్రంప్ చీఫ్ లేబర్‌ను కానుకగా ఇస్తున్నాడని మండిపడ్డాడు. విదేశీయులను బయటకు వెళ్లగొట్టి, ఉద్యోగాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) గ్రాడ్యుయేట్లతో ఈ పని ప్రారంభించాలని చెప్పాడు. అమెరికాను అమ్మకానికి పెట్టొద్దని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరాడు.