breaking news
travel agent cheating
-
ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు!
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్పదేశంగా మారుస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో అమెరికాలో ఉంటున్న భారతీయుల బెంబేలెత్తిపోతున్నారు. ఎవరిని ఎప్పుడు వెళ్లగొడతారో తెలియక హడలిపోతున్నారు. అక్రమ వలసదారుల పేరిట 300 మంది భారతీయులను ఇటీవల అమెరికా నుంచి వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. అమెరికాలోకి భారతీయులు అక్రమంగా అడుగుపెట్టడానికి ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లే ధనదాహమే కారణమని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అందుకే సదరు ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. ‘‘అమెరికాకు భారతీయులను అక్రమంగా పంపిస్తున్న ఏజెంట్లను గుర్తించే పనిలో మిషన్ ఇండియాకు సంబంధించిన కాన్సులర్ అఫైర్స్ అండ్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది నిమగ్నమయ్యారు. మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం’’అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్రమాలకు పాల్పడుతున్న ఇండియన్ ట్రావెల్ ఏజెన్సీల యజమానులు, ప్రతినిధులపై వీసా ఆంక్షలు విధించడానికి చర్యలు చేపట్టామని స్పష్టంచేసింది. ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన వలసలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని తేలి్చచెప్పింది. మనుషుల స్మగ్లింగ్ అనేది పెద్ద నేరమని వెల్లడించింది. అమెరికాకు రావాలనుకుంటే ముందు తమ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని విదేశీయులకు సూచించింది. చట్టాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అక్రమంగా వలస వచ్చినవారికే కాకుండా.. అలా రావడానికి సహకరించిన వారికి కూడా శిక్షలు ఉంటాయని ఉద్ఘాటించింది. హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి మరోవైపు హెచ్–1బీ వీసాలపై అమెరికాలోని అతివాదుల దృష్టి పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి వీసాలను ఎందుకు రద్దు చేయకూడదని అధికార డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారు లారా ఎలిజబెత్ లూమర్ ప్రశ్నించారు. చట్టపరమైన ఈ తాత్కాలిక వర్క్ వీసాలతో భారతీయులు ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలంటూ ట్రంప్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ వాదనలు వినిపిస్తున్నారు. ‘‘అక్రమ వలసదారులను బయటకు పంపిస్తున్నాం, బాగానే ఉంది.. మరి హెచ్–1బీ వీసాదారుల సంగతేమిటి?’’అని లారా ఎలిజబెత్ లూమర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘హెచ్–1బీ వీసాల కుంభకోణాన్ని ట్రంప్ ప్రభుత్వం అడ్డుకోకపోతే కోట్లాది మంది అమెరికన్లకు అసంతృప్తే మిగులుంది’’అని మరో పౌరుడు పోస్టు చేశాడు. గత 30 ఏళ్లుగా కుంభకోణం జరుగుతోందని ఆరోపించాడు. టెక్నాలజీ కంపెనీలు ఈ స్కామ్‌ను అడ్డం పెట్టుకొని వందల కోట్ల డాలర్లు ఆర్జించాయని విమర్శించాడు. అవే కంపెనీలు 2020లో ట్రంప్‌ను ఓడించాయని చెప్పాడు. అమెరికన్ల ప్రయోజనాలను పణంగా పెట్టి టెక్ కంపెనీలకు ట్రంప్ చీఫ్ లేబర్‌ను కానుకగా ఇస్తున్నాడని మండిపడ్డాడు. విదేశీయులను బయటకు వెళ్లగొట్టి, ఉద్యోగాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) గ్రాడ్యుయేట్లతో ఈ పని ప్రారంభించాలని చెప్పాడు. అమెరికాను అమ్మకానికి పెట్టొద్దని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరాడు. -
కరిగిపోయిన అమెరికా కల
చండీగఢ్/హోషియార్పూర్(పంజాబ్): ప్రమాదకరరీతిలో సముద్రంలో పడవ ప్రయాణం, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడక, మెక్సికో సరిహద్దులోని చీకటి గదుల్లో బస.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాకు ఎలాగైనా చేరుకునేందుకు భారతీయ అక్రమ వలసదారుల పడిన కష్టాలెన్నో. రహస్యంగా సరిహద్దు దాటించే ఏజెంట్లకు అప్పు చేసి మరీ డబ్బులు కట్టి అమెరికాకు ఎలాగోలా చేరుకుంటే తిరిగి పోలీసులకు దొరికిపోయి సంకెళ్లతో స్వదేశానికి వచ్చిన కొందరు అక్రమ వలసదారులు తమ కన్నీటి కష్టాలను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. తమ అమెరికా కల ఎలా చెదిరిపోయిందో వివరించారు. తీవ్రమైన నేరస్తుల్లా చేతులకు, కాళ్లకు బేడీలు వేసి సైనిక విమానంలో అమెరికా భారత్‌కు పంపింది. ఒకే ఒక టాయిలెట్ ఉన్న సైనిక విమానంలో వందమందికి పైగా అక్రమ వలసదారులను కుక్కి ఏకంగా 24 గంటల పాటు ప్రయాణం చేసి రావడం ఒక ఎత్తయితే అసలు తాము వచ్చేది స్వదేశానికి అన్న విషయం అమృత్సర్ విమానాశ్రయంలో అడుగుపెట్టేదాకా వారికి తెలియకపోవడం మరో విషాదం. అమెరికా నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న సైనిక విమానంలో 105 మంది వలసదారులన్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. వీరిలో ఒకొక్కరిదీ ఒక్కో గాథ. అందరిదే ఒకటే వ్యథ. చీకటి గదిలో ఉంచారు ‘‘నన్ను డంకీ మార్గం గుండా తీసుకెళ్లారు. మేం వెళ్తుండగా మార్గమధ్యంలో రూ.35 వేల విలువైన దుస్తులు చోరీ అయ్యాయి. మమ్మల్ని మొదట ఇటలీకి, ఆ తర్వాత లాటిన్ అమెరికాకు తీసుకెళ్లారు. 15 గంటల పాటు పడవ ప్రయాణం. తర్వాత దాదాపు 45 కిలో మీటర్లు నడిచాం. దాదాపు 18 కొండలు దాటాం. అంతెత్తు నుంచి జారిపడ్డామంటే బతికే అవకాశమే లేదు. మార్గమధ్యంలో కొన్ని మృతదేహాలను కూడా చూశాం. అమెరికాలోకి ప్రవేశించడానికి సరిహద్దు దాటకముందే మెక్సికోలో నన్ను అరెస్ట్ చేశారు. 14 రోజుల పాటు చీకటి గదిలో ఉంచారు. వేలాది మంది పంజాబీలు, వాళ్ల కుటుంబాలు, వాళ్ల పిల్లలు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. మేం వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డాం. ఇంకెవరూ ఇలా తప్పుడు మార్గాల్లో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించకండి’’ అని పంజాబ్‌లోని జలంధర్ జిల్లా దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్ సింగ్ సలహా ఇచ్చారు. కపుర్తలాలోని తర్ఫ్ బెహ్బల్ బహదూర్ గ్రామానికి చెందిన గుర్ప్రీత్ సింగ్‌ను అతని కుటుంబం ఇంటిని తాకట్టు పెట్టి అప్పు చేసి మరీ అమెరికాకు పంపింది. ఫతేగఢ్ సాహిబ్‌లో జస్వీందర్ సింగ్‌ను విదేశాలకు పంపేందుకు అతని కుటుంబం రూ.50 లక్షలు అప్పు చేసింది. పంజాబ్‌లో ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉండే జలంధర్, హోషియార్పూర్, కపుర్తలా, నవాన్షహర్ జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కథలే ఎప్పుడూ వినిపిస్తుంటాయి. ఇక్కడి నుంచి ఏటా పెద్ద సంఖ్యలో స్థానికులు డాలర్లవేటలో పడి విదేశాలకు అక్రమ మార్గాల్లో వలసలు వెళ్తున్నారు. ఉజ్వల భవిష్యత్తును ఆశిస్తూ అమెరికా వెళ్తున్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంకెళ్లతో ప్రయాణం ‘‘చట్టబద్ధంగానే అమెరికా పంపిస్తానని చెప్పి ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడు. అందుకు రూ.30 లక్షలు తీసుకున్నాడు. గతేడాది జూలైలో విమానంలో బ్రెజిల్‌కు వెళ్లాను. అక్కడి నుంచి అమెరికాకు కూడా విమానంలోనే పంపిస్తామని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. ఆరు నెలలపాటు బ్రెజిల్లో ఉన్న తరువాత.. అక్రమంగా సరిహద్దు దాటించి పంపేందుకు ప్రయత్నించారు. అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ 11 రోజుల పాటు కస్టడీలో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపించారు. భారత్‌కు పంపించేస్తున్నట్లు నాకు తెలియదు. ఏదో క్యాంప్‌కు తీసుకెళ్తున్నా రని అనుకున్నాం. అమృత్సర్ విమానాశ్రయం వచ్చాక సంకెళ్లను తీసేశారు. బహిష్కరణతో కుంగిపోయా. అమెరికా వెళ్లడానికి అప్పు చేశా ను. కుటుంబానికి మంచి భవిష్యత్ ఇవ్వా లని కలలు కన్నా. ఇప్పుడవన్నీ చెదిరిపోయాయి’’ అని గురుదాస్ పూర్ జిల్లాలోని హర్దోర్వాల్ గ్రామానికి చెందిన జస్పాల్ వాపోయారు.సముద్రంలో, అడవిలో ప్రాణాలు పోయాయి ‘‘గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లా. తొలుత యూరప్‌కు, ఆ తర్వాత మెక్సికోకు తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెంట్ హామీ ఇచ్చాడు. రూ.42 లక్షలు చెల్లించాను. కానీ ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా, ఆ తర్వాత మెక్సికో దేశాల గుండా తీసుకెళ్లారు. పర్వత మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లాం. మెక్సికో సరిహద్దు వైపు లోతైన సముద్రంలోకి ఒక చిన్న పడవలో పంపారు. నాలుగు గంటల సముద్ర ప్రయాణం. మా పడవ బోల్తా పడింది. మాతో వచ్చిన వలసదారుల్లో ఒకరు నీటిలో పడి జలసమాధి అయ్యారు. మరొకరు పనామా అడవి గుండా వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డా. దారిలో కొన్నిసార్లే అన్నం దొరికేది. మంచి భవిష్యత్తుపై ఆశతో అధిక వడ్డీకి అప్పు చేసి ఏజెంట్‌కు చెల్లించాం. కానీ ఏజెంట్ మమ్మల్ని మోసం చేశారు. అమెరికా బహిష్కరించడంతో చివరకు భారీ అప్పుతో సొంతూరకు వచ్చిపడ్డాం’’ అని హోషియార్ పూర్ జిల్లాలోని తహ్లీ గ్రామవాసి హర్విందర్ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
నిజామాబాద్: షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జాలో అల్వాజ్ క్యాటరింగ్ కంపెనీలో పని ఉందని చెప్పి 250 మందిని విడతల వారీగా విజిట్ వీసాలపై పంపించిన ఏజెంట్ పని చూపకుండా చేతులెత్తేశాడు. షార్జాకు మొదట విజిట్ వీసాలపై వెళ్లాలని అక్కడ వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్ దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించాడు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఆ కార్మికులు షార్జాలోని ఒక హోటల్లో గత నెల రోజులుగా ఉండిపోగా.. కొందరు తమకు తెలిసిన వారి ద్వారా మరో కంపెనీలో పని వెతుక్కున్నారు. మరికొందరు ఇంటిముఖం పట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.75వేలు వసూలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వర్ని మండలం కొత్తపేట్‌కు చెందిన ఓ వ్యక్తి ట్రావెల్ ఏజెన్సీని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు. లైసెన్స్ లేకపోయినా ఎంతో మందిని నమ్మకంగా గల్ఫ్ దేశాలకు పంపించాడనే ఉద్దేశంతో వలస కార్మికులు అతనిపై నమ్మకంతో డబ్బులు, పాస్‌పోర్టులు అందించారు. సదరు వ్యక్తి వివిధ ప్రాంతాల్లో దాదాపు 40 మందిని సబ్ ఏజెంట్లుగా నియమించుకుని వారి ద్వారా షార్జా పంపించడానికి 250 మంది కార్మికులకు విజిట్ వీసాలను జారీ చేశాడు. ఒక్కొక్కరి వద్ద విజిట్ కమ్ వర్క్ వీసాల కోసం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు వసూలు చేశాడు. అయితే కేవలం విజిట్ వీసాలనే కార్మికులకు అంటగట్టి షార్జా పంపించాడు. అక్కడ వర్క్ వీసా ఇప్పించకుండా పత్తా లేకుండా పోయి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడంతో ఏజెంట్ మోసం బయటపడింది. కాగా, వలస కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో ఏజెంట్ సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేఎస్ ట్రావెల్స్‌కి చెందిన చిట్యాల స్వామిపై వలస కార్మికుల కుటుంబ సభ్యులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందనేది విచారణ చేస్తున్నాం.. అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు సాక్షికి వెల్లడించారు. -
బలవంతంగా కాంట్రాక్ట్ మ్యారేజ్.. ఆపై
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన యువతి ఓ ట్రావెల్ ఏజెంట్ మోసానికి బలైపోయింది. దుబాయ్ షేక్ చేతికి చిక్కి నరకం అనుభవిస్తోంది. వివరాలు.. బాధితురాలిని ట్రావెల్ ఏజెంట్ ఒకరు దుబాయ్‌కు పంపిస్తామని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో రెండు లక్షలు తీసుకుని దుబాయ్ షేక్‌కు ఆమెను అమ్మేశాడు. అనంతరం అతడితో బలవంతంగా కాంట్రాక్ట్ మ్యారేజీ చేయించాడు. అప్పటి నుంచి దుబాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. (చదవండి: కామాంధుల క్రూరత్వానికి పరాకాష్ట.. ) అతడు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక అతడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు.. మరోచోట తలదాచుకుంది. ఈ విషయం తెలుసుకున్న షేక్.. ఆమె ఆచూకీ కనిపెట్టి ఇంటికి తీసుకువచ్చి మళ్లీ హింసించడం ఆరంభించాడు. అతడికి తెలియకుండా తన తల్లికి ఫోన్ చేసిన బాధితురాలు.. తనను ఎలాగైనా కాపాడాలంటూ వేడుకుంది. ఈ విషయం గురించి మీడియాతో గోడు వెళ్లబోసుకున్న ఆమె తల్లి.. తన కుమార్తెను ఎలాగైనా రక్షించి హైదరాబాద్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
నకిలీ హెలికాప్టర్ టికెట్లతో మోసం
హైదరాబాద్: కేదార్నాథ్ యాత్ర కోసం వెళ్లిన తెలుగు యాత్రికులు ఇక్కట్లు పడుతున్నారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలోని బాబూరావు వీధికి చెందిన 54 కుటుంబాలు కేదార్నాథ్ వెళ్లగా తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయారు. అక్కడ తమిళనాడుకు చెందిన ఓ ఏజెంట్.. యాత్రికులకు నకిలీ హెలికాప్టర్ టికెట్లను అంటగట్టాడు. హెలికాప్టర్లో వెళ్లేందుకు బాధితులు ఒక్కొక్కరు ఏజెంట్‌కు రూ. 8,300 చెల్లించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 130 మంది యాత్రికులు కేదార్‌నాథ్‌కు వెళ్లారు. అయితే ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 50 వేలు వరకు వసూలు చేసినట్టు బాధితులు వాపోయారు. ప్రస్తుతం ఉత్తరఖండ్‌లోని పట్టా, గుప్తకాశి, రుద్రప్రయాగ జిల్లాల్లో బాధితులు ఉన్నట్టు తెలిసింది. మొత్తం 135 మంది బాధితులు ప్రభుత్వ సాయం చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి 52 మంది, విజయవాడ నుంచి 54 మంది, వేరే ప్రాంతాల నుంచి మరో 35 మంది కేదార్నాథ్ వెళ్లిన యాత్రికులు ఉన్నారు. రుద్రప్రయాగలోని పోలీసు స్టేషన్ ఎదుట ఈ యాత్రికులంతా నిరసనకు దిగారు.