నిజామాబాద్‌లో కేటుగాడు!.. 250 మందిని షార్జాకి తీసుకెళ్లి..  పత్తా లేకుండా పోయి..

Travel Agent Cheat Few Nizamabad Over Work At Sharjah - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని షార్జాలో అల్వాజ్‌ క్యాటరింగ్‌ కంపెనీలో పని ఉందని చెప్పి 250 మందిని విడతల వారీగా విజిట్‌ వీసాలపై పంపించిన ఏజెంట్‌ పని చూపకుండా చేతులెత్తేశాడు. షార్జాకు మొదట విజిట్‌ వీసాలపై వెళ్లాలని అక్కడ వర్క్‌ వీసా ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్‌ దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించాడు.

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన ఆ కార్మికులు షార్జాలోని ఒక హోటల్‌లో గత నెల రోజులుగా ఉండిపోగా.. కొందరు తమకు తెలిసిన వారి ద్వారా మరో కంపెనీలో పని వెతుక్కున్నారు. మరికొందరు ఇంటిముఖం పట్టారు. 

ఒక్కొక్కరి నుంచి రూ.75వేలు వసూలు
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో వర్ని మండలం కొత్తపేట్‌కు చెందిన ఓ వ్యక్తి ట్రావెల్‌ ఏజెన్సీని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు. లైసెన్స్‌ లేకపోయినా ఎంతో మందిని నమ్మకంగా గల్ఫ్‌ దేశాలకు పంపించాడనే ఉద్దేశంతో వలస కార్మికులు అతనిపై నమ్మకంతో డబ్బులు, పాస్‌పోర్టులు అందించారు. సదరు వ్యక్తి వివిధ ప్రాంతాల్లో దాదాపు 40 మందిని సబ్‌ ఏజెంట్లుగా నియమించుకుని వారి ద్వారా షార్జా పంపించడానికి 250 మంది కార్మికులకు విజిట్‌ వీసాలను జారీ చేశాడు.

ఒక్కొక్కరి వద్ద విజిట్‌ కమ్‌ వర్క్‌ వీసాల కోసం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు వసూలు చేశాడు. అయితే కేవలం విజిట్‌ వీసాలనే కార్మికులకు అంటగట్టి షార్జా పంపించాడు. అక్కడ వర్క్‌ వీసా ఇప్పించకుండా పత్తా లేకుండా పోయి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేయడంతో ఏజెంట్‌ మోసం బయటపడింది. కాగా, వలస కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో ఏజెంట్‌ సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేఎస్‌ ట్రావెల్స్‌కి చెందిన చిట్యాల స్వామిపై వలస కార్మికుల కుటుంబ సభ్యులు వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందనేది విచారణ చేస్తున్నాం.. అని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు సాక్షికి వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top