భారత్, యూఏఈ నిర్ణయం
కీలక రక్షణ భాగస్వామ్యం!
భారత్‌కు 5 లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జీ
మోదీ, నహ్యాన్ కీలక ఒప్పందాలు
యూఏఈ అధ్యక్షునికి మోదీ స్వాగతం
ఆత్మియ ఆలింగనం, ఒకే కార్లో ప్రయాణం
పలు అంశాలపై గంటకు పైగా చర్చలు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, యూఏఈ నిర్ణయించాయి. 2032 నాటికి పరస్పర వార్షిక వాణిజ్యాన్ని ఏకంగా రూ.18 లక్షల కోట్లకు (200 బిలియన్ డాలర్లకు) పెంచుకోవాలని తీర్మానించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రధాని నరేంద్ర మోదీ చర్చల సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. సోమవారం నహ్యాన్ కుటుంబసమేతంగా భారత్‌లో పర్యటించారు.
మోదీ ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మరీ ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. కరచాలనం అనంతరం అధినేతలిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తర్వాత చర్చల నిమిత్తం లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికార నివాసానికి మోదీ, నహ్యాన్ ఒకే కారులో వెళ్లడం విశేషం! కొన్నేళ్లుగా యూఏఈతో బలపడుతూ వస్తున్న భారత బంధానికి ఈ సన్నివేశం అద్దం పట్టిందని చెబుతున్నారు. 2023–24లో ఇరు దేశాల నడుమ 84 బిలియన్ డాలర్ల మేరకు వర్తకం జరిగింది.
ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిందే
నహ్యాన్, మోదీ చర్చల సందర్భంగా భారత్, యూఏఈ నడుమ వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం దిశగా కీలక ముందడుగు పడింది. దానితో పాటు అంతరిక్ష మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా ఒప్పందం కుదిరింది. వీటి విధివిధానాల ఖరారుకు తదితరాలకు సంబంధించిన లెటర్స్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు జరిగాయి. దీర్ఘకాలిక ప్రాతిపదికన భారత్‌కు యూఏఈ ఏటా 5 లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జీ సరఫరా చేసేలా కూడా ఒప్పందం కుదిరింది.
గుజరాత్‌లోని ధొలెరాలో ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లో యూఏఈ పెట్టుబడులు పెట్టనుంది. అధినేతలు ఇరువురూ తొలుత ఏకాంతంగా సమావేశమయ్యారు. రక్షణ మొదలుకుని వర్తకం, ఇంధనం, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై లోతుగా చర్చించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని వారు ముక్త కంఠంతో ఖండించారు. వాటికి ప్రోత్సాహం, ఆర్థిక మద్దతు ఇచ్చేవారిని కూడా శిక్షించాల్సిందేనని పునరుద్ఘాటించారు.
ఆహార భద్రత, వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం తదితరాలపై ఈ సందర్భంగా ఒప్పందాలు జరిగాయి. కృత్రిమ మేధ రంగంలో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నేతలు నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఇరు దేశాల బృందాలు కూడా చర్చల్లో పాల్గొన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. చర్చల వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
ఇందుకోసం దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ మక్తోమ్, ఇతర రాజ కుటుంబీకులు, మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన భారీ బృందం నహ్యాన్‌తో పాటు వచి్చనట్టు ఆయన వివరించారు. అధినేతల సమక్షంలో ఇరు బృందాలు పలు ఒప్పంద పత్రాలను ఇచి్చపుచ్చుకున్నట్టు చెప్పారు. వ్యవసాయ రంగం ఒప్పందంతో భారత రైతులకు లబ్ధి చేకూరడంతో యూఏఈకి ఆహార భద్రత లభిస్తుందని మిస్రీ తెలిపారు. పౌర అణు ఇంధన రంగంలో భాగస్వామ్య అవకాశాలను ఇరుదేశాలు మరింతగా అన్వేíÙంచనున్నట్టు చెప్పారు. అలాగే ‘డేటా ఎంబసీ’ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలిస్తాయన్నారు.
తమ చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు మోదీ పేర్కొన్నారు. నహ్యాన్‌ను తన సన్నిహిత మిత్రునిగా సంబోధించారు. ‘‘విమానాశ్రయానికి వెళ్లి నా సోదరునికి స్వాగతం పలికా. భారత్, యూఏఈ మధ్య బలమైన మిత్ర బంధానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ పర్యటన అద్దం పడుతోంది’’అంటూ ఎక్స్ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. ఇరుదేశాల నడుమ ఇప్పటికే కీలకమైన ఒప్పందాలెన్నో కుదిరాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, స్థానిక కరెన్సీలోనే చెల్లింపుల వ్యవస్థ, ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం వంటివి వాటిలో ఉన్నాయి.
పశ్చిమాసియాపైనే చర్చ?
పశి్చమాసియా ప్రాంతంలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఉద్రిక్తతలపైనే మోదీ, నహ్యాన్ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇరాన్‌లో ఆందోళనలు, నిరసనలు నానాటికీ మిన్నంటుతుండటం తెలిసిందే. వాటికి ఇప్పటికే కనీసం 5 వేల మందికి పైగా బలయ్యారు. అవసరమైతే ఇరాన్‌పై దాడికి కూడా వెనకాడబోమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఉద్రిక్తతలు ఓ దశలో తారస్థాయికి చేరాయి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం పూర్తిగా ముగియలేదు. వీటికి తోడు యెమన్ కారణంగా యూఏఈ కూడా సోదర దేశమైన సౌదీ అరేబియాపై ఇటీవలే కత్తులు దూయాల్సి వచి్చంది.
యెమన్‌లోని ముకల్లా పోర్టును యూఏఈ దన్నుతో స్థానిక సాయుధ గ్రూపు చెరబట్టడంతో సౌదీ ఆగ్రహించి ఆ పోర్టుపై క్షిపణి దాడులకు దిగింది. సౌదీ హెచ్చరికలతో యెమన్ నుంచి యూఏఈ తన సేనలను ఉపసంహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫోన్లలో మాట్లాడేందుకు కుదరని పలు ‘అత్యవసర’అంశాలపై చర్చల నిమిత్తమే నహ్యాన్ హుటాహుటిన భారత్ వచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అవేమిటన్నది మాత్రం సస్పెన్స్‌గానే మిగిలింది. పశి్చమాసియా ప్రాంతంలో భారత్‌కు యూఏఈ అత్యంత సన్నిహిత మిత్ర దేశం. కరోనా సమయంలో భారత్ తక్షణం స్పందించి అత్యవసరమైన వ్యాక్సీన్లు తదితరాలను యూఏఈకి భారీగా సరఫరా చేసింది. నాటినుంచీ ఇరుదేశాల బంధం మరింత బలపడింది.
ప్రయాణం 6 గంటలు... పర్యటన 1.45 గంటలు!
నహ్యాన్ తాజా పర్యటనకు దౌత్య కోణంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నట్టు చెబుతున్నారు. అయితే, ఈ పర్యటనలో విపరీతమైన ఆసక్తికి కారణంగా నిలిచిన విశేషం మరొకటుంది. అదేమిటంటే, నహ్యాన్ పర్యటన కేవలం అక్షరాలా గంటా నలభై ఐదు నిమిషాల పాటు మాత్రమే కొనసాగడం! అబుదాబి నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణ సమయమే 3 గంటలకు పైగా ఉంటుంది. నహ్యాన్ సోమవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు పాలెం విమానాశ్రయంలో దిగారు. 4.45కు మోదీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తిరిగి సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు యూఏఈకి పయనమయ్యారు.
అంటే భారత్‌లో గడిపింది కేవలం 1.45 గంటలు. అందుకోసం రానూ పోనూ నహ్యాన్ 6 గంటలకు పైగా ప్రయాణం చేశారు! ఒక దేశాధినేత అధికారిక పర్యటన కేవలం ఇంత తక్కువ సమయం పాటు జరగడం అసాధారణమేనని దౌత్య నిపుణులు అంటున్నారు. ‘‘నహ్యాన్ రాక ఏదో వేరే దేశ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో జరిగిన బాపతు కాదు. కేవలం మోదీతో భేటీ అయ్యేందుకే ఆయన యూఏఈ నుంచి బయల్దేరి వచ్చారు. బహుశా అతి ముఖ్యమైన అంశంపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరమే ఇందుకు దారితీసి ఉంటుంది’’అని వారు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఆహా్వనం మేరకే నహ్యాన్ భారత పర్యటనకు వస్తున్నట్టు విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఊయల ఊగారు!
నహ్యాన్‌కు మోదీ బహుమతులు
యూఏఈ అధ్యక్షుడు నహ్యాన్‌కు ప్రధాని మోదీ పలు అరుదైన కానుకలు అందజేశారు. గుజరాతీ కళాకారులు అత్యంత నైపుణ్యంతో తయారు చేసిన చెక్క ఊయల, కశ్మీర్‌కు చెందిన పష్మీనా శాలువా తదితరాలు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా నేతలిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ఊయలపై కూర్చుని అలరించారు. కశీ్మరీ శాలువాను తెలంగాణలో తయారు చేసిన వెండి పెట్టెలో పెట్టివ్వడం విశేషం. నహ్యాన్‌తో పాటు వచ్చిన ఆయన తల్లి, ఇతర రాజకుటుంబ సభ్యులకు కూడా శాలువాలతో పాటు కశీ్మరీ కుంకుమ పువ్వు తదితరాలను మోదీ అందజేశారు.


