
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మరోసారి తన మంత్ర దండం బయటకు తీశారని.. వ్యస్థలను మేనేజ్ చేస్తూ తన మోసాలను ప్రశ్నించేవారి గొంతును నొక్కేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే.. లిక్కర్ స్కాం అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారాయన. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘‘మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా?. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా?. ఎక్కడైనా దుకాణాలు 33 శాతం తగ్గిస్తే లంచాలు ఇస్తారా?. 2019-2024 మధ్య లిక్కర్ సేల్ తగ్గింది. ఒక్క కంపెనీకి లైసెన్స్ ఇవ్వలేదు. ట్యాక్స్‌లు పెంచాం. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు పోలేదు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాం. అదే సమయంలో.. మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేశాం. ప్రతీ బాటిల్‌పై క్యూఆర్ కోడ్ పెట్టించాం.లాభాపేక్ష లేకుండా మా(వైఎస్సార్‌సీపీ) ప్రభుత్వం అమ్మకాలు జరిపాం.

.. అసలు లిక్కర్ స్కాం (Jagan on Liquor Scam) ఎక్కడ జరిగింది?. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ 12 నెలల కాలంలో లిక్కర్ సేల్ పెరిగింది. కూటమి పాలనలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయి. బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడం లేదు.. మద్యాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే అవి నడుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కొత్త కొత్త బ్రాండులను తీసుకొచ్చారాయన.
గతంలో..(2014-19) తన హయాంలోనూ లిక్కర్ సేల్స్ పెంచుకుంటూ పోయారు. తద్వారా అమ్మకాలు పెరిగాయి. కాబట్టే లిక్కర్ కంపెనీలకు లాభాలు వెళ్లాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాంటప్పుడు స్కాం ఎక్కడ జరిగింది?. డిస్టరీలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మా హయాంలో ఉందా?’’ అని జగన్ ప్రశ్నించారు.

గతంలో లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టికి బెయిల్ మీద ఉంది నిజం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు.. లాటరీ పేరుతో రిగ్గింగ్ చేసి మద్యం షాపులు దోచుకున్నారు. ఆనాడు కూడా ప్రైవేట్ సిండికేట్‌కు మేలు చేశారు. తనకు కావాల్సిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారు. 2015-19 మధ్య ఐదు కంపెనీలు 69 శాతం ఆర్డరులు ఇచ్చారు. తద్వారా కొన్నిబ్రాండ్‌లకు మాత్రమే డిమాండ్ సృష్టించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ సిండికేట్‌కు లబ్ధి చేకూర్చడం కోసం.. తన పాలసీని కొనసాగించడం కోసం.. ఏం స్కాం జరగకపోయినా వైఎస్సార్‌సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు.
భయపెట్టి.. బెదిరించి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి.. తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి(V. Vijayasai Reddy). వైఎస్సార్‌సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని.. మూడేళ్ల టర్మ్ ఉండగానే కూటమికి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి.. ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది?.
లోక్‌సభ ఎంపీ, ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏం సంబంధం?. ఆయన తండ్రి పెద్దిరెడ్డి కనీసం ఆ శాఖ మంత్రి కూడా కాదు. ఐఏఎస్, ఐపీఎస్‌లను జైళ్లో పెట్టిన చరిత్ర లేదు. సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అరెస్ట్ చేసిన ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కేసిరెడ్డి ఒకరు. కేసిరెడ్డికి, బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఏం సంబంధం?. విజయవాడ టీడీపీ ఎంపీ, కేసిరెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. కేసిరెడ్డి అప్రూవర్‌గా మారలేదని నిందితుడిగా చేర్చారు. కావాల్సిన స్టేట్‌మెంట్ ఇస్తే కేసిరెడ్డిని వదిలేసేవారు.
లిక్కర్ స్కాంకి సంబంధించి ఒక్క ఫైల్ అయినా సీఎంవోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా? అని చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా. కుట్రలు చేసి.. సంబంధం లేని వ్యక్తులనూ తెరపైకి తీసుకొచ్చి లిక్కర్ కేసులంటూ తప్పుడు కేసులు పెడుతూ.. రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు. ఐపీఎస్‌లు సంజయ్, కాంతిలాల్ ఠాణా, జాషువా, విశాల్ గున్నీ, ధనుంజయ్, రఘురామ్ రెడ్డి ఇలా అధికారులను వేధిస్తున్నారు అని వైఎస్ జగన్ అన్నారు.