
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.
టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ..‘కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించండి. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి?. ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా?.(కుడా చైర్మన్, డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు). కూటమిలో పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నిసార్లు బయటకు రాలేదు.
టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలి. నేను వాళ్లకు ఇవ్వకూడదు అని అనడం లేదు. మా నిష్పత్తి ప్రకారం టీడీపీకి కూడా ఇవ్వండి అంటున్నాను. ద్వితీయ శ్రేణి నేతలు తమ ఇంట్లో వారికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మా వాటా పదవులు మాకు సక్రమంగా ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు.