
ఐదు రోజుల్లోపే అధిరోహణ
బ్రిటిష్ బృందం కొత్త రికార్డు
కఠ్మాండు: బ్రిటన్‌కు చెందిన నలుగురు పర్వతారోహకుల బృందం సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఆ శిఖరాన్ని ఎలాంటి ముందస్తు సన్నద్ధతా లేకుండా ఐదంటే ఐదు రోజుల్లోపే అధిరోహించి అబ్బురపరిచింది. 8,849 మీటర్ల ఎత్తులో ఉండే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలంటే నేపాల్‌లోని బేస్ క్యాంప్ వద్ద కనీసం కొద్ది నెలల పాటు శారీరకంగా, మానసికంగా సన్నద్ధమవడం తప్పనిసరి. బ్రిటిష్ బృందం మాత్రం అలాంటిదేమీ లేకుండానే పని కానిచ్చేసింది. మే 16న లండన్ నుంచి బయల్దేరి కఠ్మాండు చేరింది.
అదే రోజు మధ్యాహ్నం ఎవరెస్టు బేస్ క్యాంపు చేరుకుని నేరుగా అధిరోహణ మొదలు పెట్టేసింది. బుధవారం ఉదయానికల్లా విజయవంతంగా శిఖరాగ్రం చేరింది. ఈ మొత్తానికీ పట్టింది కేవలం 4 రోజుల 18 గంటలు మాత్రమే. ఈ బృందంలోని నలుగురూ స్పెషల్ ఫోర్సెస్‌లో సైనికులుగా పని చేసి రిటైరైనవాళ్లే కావడం విశేషం. పైగా వారిలో ఒకరు మాజీ మంత్రి కూడా. వారంతా మూడు నెలలపాటు బ్రిటన్‌లోనే పక్కా ప్రణాళికతో సన్నద్ధమయ్యారు. అందుకోసం ఎవరెస్టు ఆరోహణ క్రమంలో ఎదరయ్యే పరిస్థితులన్నింటినీ లండన్‌లోనే కృత్రిమంగా సృష్టించుకున్నారు. హైపోక్సియా టెంట్లు, జెనాన్ వాయువు, ఇతర సాంకేతికతను ఉపయోగించుకున్నారు.
ఏమిటీ టెంట్లు?
సాధారణంగా పైకి వెళ్తున్న కొద్దీ వాతావరణం పలుచబడుతూ వస్తుంది. దాంతోపాటే ఆక్సిజన్ స్థాయి కూడా తగ్గిపోతుంటుంది. 8 కి.మీ. ఎగువన భూ ఉపరితలంతో పోలిస్తే కేవలం మూడో వంతు ఆక్సిజనే అందుబాటులో ఉంటుంది. దాంతో శ్వాసించడం కష్టతరంగా మారుతుంది. అది ఎన్నో ఇతర సమస్యలకూ దారితీస్తుంది. ఎవరెస్టు ఎత్తేమో ఏకంగా 8.8 కి.మీ. పై చిలుకు. అందుకే పర్వతారోహకులు దాన్ని ముద్దుగా డెత్ జోన్ అని పిలుచుకుంటారు. ఎంతటి కొమ్ములు తిరిగిన పర్వతారోహకులైనా అక్కడి అత్యంత ప్రతికూల పరిస్థితులకు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
అందుకోసం కఠ్మాండులోనో, ఎవరెస్టు బేస్ క్యాంప్ వద్దో కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలైనా గడపడం తప్పనిసరి. సన్నద్ధతలో భాగంగా బేస్ నుంచి ఎవరెస్టుపైకి వెళ్లే దారిలోని ఎగువ క్యాంపులకు ప్రాక్టీస్ రన్ తదితరాలు చేపడతారు. అంతా ఓకే అనుకున్నాకే శిఖరాగ్రానికి బయల్దేరతారు. అయితే బేస్ క్యాంప్ వద్ద ఎంతకాలం సన్నద్ధతలో గడపాలన్న దానిపై నేపాల్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలూ విధించలేదు. బ్రిటిష్ బృందం సభ్యులు తమ సన్నద్ధతలో భాగంగా లండన్‌లో ఆరు వారాల పాటు హైపోక్సియా టెంట్లలో నిద్రించారు. అనంతరం జర్మనీలో ఓ క్లినిక్‌లో రెండు వారాల పాటు జెనాన్ వాయువును పీలుస్తూ వచ్చారు.
హైపోక్సియా టెంట్లలోని ప్రత్యేక జనరేటర్ ఆక్సిజన్‌ను పీల్చేస్తుంది. దాంతో టెంట్ల లోపల ఆక్సిజన్ స్థాయి మూడో వంతుకు తగ్గుతుంది. ‘‘జెనాన్ వాయువు ఆలి్టట్యూడ్ సిక్‌నెస్‌ను అరికడుతుంది. అంతేగాక శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందనప్పుడు ఏర్పడే హైపోక్సియా తరహా పరిస్థితిని ఎదుర్కొనేందుకు దోహదపడే ఎరిత్రోపొయిటెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతుంది’’అని ఈ యాత్రను ఆర్గనైజ్ చేసిన లూకాస్ ఫర్టెన్‌బాచ్ వివరించారు.
నలుగురూ క్షేమంగా ఉన్నారని, శిఖరాగ్రం నుంచి కిందకు దిగడం మొదలు పెట్టారని చెప్పారు. ‘‘ఈ కొత్త పద్ధతి వల్ల నేపాల్‌లో నెలల తరబడి గడపాల్సిన అవసరం తగ్గుతుంది. కనుక ఎవరెస్టు యాత్ర ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది’’అన్నారు. అయితే జెనాన్ వాయువు వాడటం వంటివి మంచి పద్ధతులు కావని పర్వతారోహణ నిపుణులు అంటున్నారు. ‘‘అది ఆక్సిజన్ కొరత ప్రభావాన్ని అడ్డుకుంటుందనేందుకు శాస్త్రీయ రుజువులేమీ లేవు. పైగా దాని వాడకం ప్రమాదకరం కూడా కావచ్చు’’అని హెచ్చరిస్తున్నారు.
11 గంటల రికార్డు పదిలమే
అత్యంత వేగంగా ఎవరెస్టును అధిరోహించిన రికార్డును మాత్రం బ్రిటిష్ బృందం బద్దలు కొట్టలేకపోయింది. లాక్పా గెలు షెర్పా 2003లో బేస్ క్యాంప్ నుంచి మొదలుపెట్టి కేవలం 10 గంటల 58 నిమిషాల్లోనే ఎవరెస్టు శిఖరాగ్రం చేరారు. ఇప్పటిదాకా ఎవరూ దాని దరిదాపులకు కూడా రాలేకపోయారు.