
ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో 29 పతకాలతో అగ్రస్థానం
చివరి రోజు మహిళల 4గీ100 మీటర్ల మెడ్లీ రిలేలో అమెరికా బృందం
కొత్త ప్రపంచ రికార్డు ‘బెస్ట్ స్విమ్మర్స్’గా సమ్మర్ మెకింటోష్, లియోన్ మర్చండ్
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ పోటీల్లో తమకు తిరుగులేదని అమెరికా మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అమెరికా 29 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇందులో 9 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. చివరిరోజు మహిళల 4గీ100 మీటర్ల మెడ్లీ రిలేలో రేగన్ స్మిత్, కేట్ డగ్లస్, గ్రెట్‌చెన్ వాల్ష్, టోరీ హుస్కీలతో కూడిన అమెరికా బృందం కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని హస్తగతం చేసుకుంది.
అమెరికా బృందం 3 నిమిషాల 49.34 సెకన్లలో రేసును ముగించింది. ఈ క్రమంలో గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో 3 నిమిషాల 49.63 సెకన్లతో అమెరికా బృందమే నెలకొల్పిన ప్రపంచ రికార్డును అమెరికా జట్టే బద్దలు కొట్టింది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ప్రపంచ రికార్డుతో, పసిడి పతకంతో ముగించడం చాలా ఆనందంగా ఉంది. ఈత కొలనులో దూకితే మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం. సింగపూర్ నుంచి నవ్వుతూ తిరిగి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ప్రపంచ రికార్డు నెలకొల్పిన అమెరికా మెడ్లీ రిలే బృందం సభ్యురాలు గ్రెట్‌చెన్ వాల్ష్ వ్యాఖ్యానించింది.
ఆ్రస్టేలియా 8 స్వర్ణాలు, 6 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 20 పతకాలు సాధించి రెండో స్థానంలో... ఫ్రాన్స్ 4 స్వర్ణాలు, 1 రజతం, 3 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో కెనడా టీనేజ్ స్టార్ సమ్మర్ మెకింటోష్... పురుషుల విభాగంలో ఫ్రాన్స్ స్టార్ లియోన్ మర్చండ్ ‘ఉత్తమ స్విమ్మర్లు’ పురస్కారాలు గెల్చుకున్నారు.
ఆఖరి రోజు ఆదివారం ఎనిమిది ఈవెంట్స్‌లో ఫైనల్స్ జరిగాయి. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రష్యాకు చెందిన క్లిమెంట్ కొలెస్నికోవ్ (23.68 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా క్రీడాకారులపై నిషేధం ఉన్న నేపథ్యంలో క్లిమెంట్ తటస్థ స్విమ్మర్‌గా ఈ పోటీల్లో బరిలోకి దిగాడు. మహిళల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో రుటా మెలుటైట్ (లిథువేనియా; 29.55 సెకన్లు) బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
మహిళల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో మెగ్ హారిస్ (ఆస్ట్రేలియా; 24.02 సెకన్లు) విజేతగా నిలిచింది. పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో అహ్మద్ జవోది (ట్యూనీషియా; 14 నిమిషాల 34.41 సెకన్లు) పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 4గీ100 మీటర్ల మెడ్లీ రిలే ఈవెంట్‌లో తటస్థ స్విమ్మర్లుగా బరిలోకి దిగిన రష్యా బృందం బంగారు పతకాన్ని గెలిచింది. మిరోన్ లిఫింత్‌సెవ్, కిరిల్ ప్రిగోడా, ఆండ్రీ మినాకోవ్, ఇగోర్ కొర్నెవ్‌లతో కూడిన తటస్థ బృందం 3 నిమిషాల 26.93 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది.
మర్చండ్ ‘హ్యాట్రిక్’...
పురుషుల 400 మీటర్ల మెడ్లీ విభాగంలో లియోన్ మర్చండ్ (ఫ్రాన్స్; 4 నిమిషాల 04.73 సెకన్లు) చాంపియన్‌గా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. 2022, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌ల్లోనూ ఈ విభాగంలో మర్చండ్ స్వర్ణ పతకాలు నెగ్గ డం విశేషం. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్ చరిత్ర లో మర్చండ్‌కిది ఏడో పసిడి పతకం కావడం గమనార్హం.
ఐదు పతకాలతో....
మహిళల 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్‌లో సమ్మర్ మెకింటోష్ (కెనడా; 4 నిమిషాల 25.78 సెకన్లు) విజేతగా నిలిచి ఈ మెగా ఈవెంట్‌ను నాలుగో స్వర్ణ పతకంతో, ఓవరాల్‌గా ఐదో పతకంతో ముగించింది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్, మెడ్లీ, 200 మీటర్ల మెడ్లీ, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన 18 ఏళ్ల మెకింటోష్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో కెనడా గెల్చుకున్న మొత్తం ఎనిమిది పతకాల్లో ఐదు మెకింటోష్వే కావడం విశేషం.