
లండన్: ఇటీవలే భారత్‌లోని ముంబైలో పర్యటించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇక్కడి ఆధార్ డిజిటల్ బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థను భారీ విజయంగా అభివర్ణించారు. యూకే రూపొందిస్తున్న ప్రణాళికాబద్ధ డిజిటల్ గుర్తింపు కార్యక్రమం ‘బ్రిట్ కార్డ్’కు దీనిని ఒక నమూనాగా పరిగణిస్తున్నామన్నారు.
ఆధార్ కార్డు ప్రజా సంక్షేమం, సేవలకు బయోమెట్రిక్ డేటాను ఉపయోగిస్తుండగా, యూకే పథకం మరోలా ఉపయుక్తం కానుంది. అక్రమ వలసలను అరికట్టే దిశగా యూకే ‘బ్రిట్ కార్డ్’ను తీసుకురానుంది. అయితే దీనిపై యూకేలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన రెండు రోజుల ముంబై పర్యటనలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ రూపకల్పనలో సహకారం అందించిన నందన్ నీలేకనితో పాటు పలువురితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారతదేశంలో అమలవుతున్న డిజిటల్ ఐడీ కార్యక్రమం అమలు, ప్రభావంపై చర్చించారు. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆధార్.. దేశంలోని ప్రజలందరికీ కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది. బ్యాంకింగ్, సంక్షేమం తదితర సేవలకు ఆధారంగా మారింది. ఈ వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థకు పరిపాలనా ఖర్చులను ఆదా చేయడంలో కీలకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆదార్‌లోని లోతుపాతులపై చర్చించిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. బ్రిట్ కార్డు దీనికి భిన్నమైన డిజైన్‌తో ఉంటుందని, బయోమెట్రిక్ డేటాను సేకరించదని తెలిపారని ‘ది గార్డియన్’ పేర్కొంది. కాగా బ్రిట్ కార్డ్ కోసం యూకే ప్రభుత్వం ఇంకా ఏ ప్రైవేట్ టెక్నాలజీ ప్రొవైడర్లతోనూ భాగస్వామ్యం కాలేదని సమాచారం. బ్రిట్ కార్డు ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తుందని ప్రతిపక్ష పార్టీలు, కొందరు లేబర్ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.