
సృష్టిలోని అన్ని జీవరాశులలో ఏ ఒక్కటీ అధికం కాదు, ఏదీ అల్పం కాదు. అన్నీ సమానమే. అవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన అవసరాలకు ప్రకృతిపై ఆధారపడతాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం ముందుకు సాగదు. దీనిని గమనించిన నిపుణులు, శాస్త్రవేత్తలు జీవవైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా చూడాలని ఎన్నోఏళ్లుగా మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్యసమితి ప్రతీఏటా మే 22న అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని(International Day for Biological Diversity) నిర్వహిస్తూ వస్తోంది.
దెబ్బతీస్తున్న జీవనశైలి
ప్రస్తుతం భూమిపై ఉన్న కోట్లాది జాతుల వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామంగా చెబుతారు. మనిషి జీవనశైలి కారణంగా పర్యావరణంలో కాలుష్యం(Pollution) వ్యాపించి, భూగోళం వేడెక్కిపోతున్నది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పర్యవసానంగా పలు జీవజాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలో గల 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. ఇక్కడ ఒకనాడు సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతుజాతులు ఉండేవి. వివిధ కారణాలతో అనేక జీవాలు కనుమరుగవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికి పైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటివనరులు అంతరించిపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్లను స్వార్థ ప్రయోజనాల కోసం ఎండగట్టారు. అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి అంతమొందిస్తున్నారు.
అక్కడ జీవవైవిధ్యం పదిలం
వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, కీటకనాశనుల వినియోగానికి ప్రాధాన్యత పెరిగింది. దీంతో నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అయితే దేశంలో ఆదివాసులు అధికంగా ఉన్నచోట జీవవైవిధ్యం పదిలంగా ఉందని చెప్పుకోవచ్చు. మన దేశంలో 53 మిలియన్లకు మించిన ఆదివాసులు నివసిస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లో 80 శాతానికి మించిన రీతిలో గిరిజనులున్నారు. దీంతో అక్కడ జన్యువైవిధ్యం ఎక్కువగా ఉంది. మరోవైపు ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న జన్యుమార్పిడి విధానం జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తోంది. వీటిని రూపొందించి, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మానవ మనుగడ ప్రశ్నార్థకం
వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప, కప్పను తిని పాము, పామును తిని గద్ద జీవిస్తుంది. గద్ద మరణించాక దానిని వివిధ క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టులా సాగుతుంది. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా, మిగతా అన్నిటి మీదా ప్రభావం పడుతుంది. దీనికి మనిషి అడ్డుపడితే అది వినాశనానికి దారి తీస్తుంది. భూమిపై ఏ ఒక్క జీవి అంతరించినా, మానవ మనుగడ(Human survival) ప్రశ్నార్థకమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది జీవరాశులు అంతరించిపోతున్నాయి. అయితే వాతావరణ సమతుల్యానికి, పర్యావరణ పరిరక్షణకు జీవరాశులను కాపాడుకోవడం అత్యవసరం. అందుకే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి: నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే..