
నైరోబి: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. తరువాత అవి మరో నాలుగు వాహనాలను బలంగా తాకాయి. ఈ దుర్ఘటనలో 63 మంది మరణించారు. ప్రమాదంలో లెక్కలేనంతమంది గాయపడ్డారు.
కిర్యాండోంగో జిల్లాలోని కంపాలా-గులు హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా రెండు బస్సులు ఓవర్‌టేకింగ్ చేస్తూ, ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సమయంలో ఆ బస్సుల డ్రైవర్లు ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో అవి ఒక ట్రక్, ల్యాండ్ క్రూయిజర్‌తో పాటు నాలుగు వాహనాలను నియంత్రణ కోల్పోయేలా చేయడంతో, అవి బోల్తా పడ్డాయని పోలీసులు తెలిపారు. తొలుత మృతుల సంఖ్యను 63గా ప్రకటించిన పోలీసులు ఆ సంఖ్యను 46గా సవరించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి.
ప్రమాదంలో గాయపడిన వారిని కిర్యాండోంగో ఆస్పత్రితో పాటు సమీపంలోని ఇతర వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి గాయాల తీవ్రత తదితర వివరాలను వారు అందించలేదు. బాధిత కుటుంబాలకు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసేవేని సంతాపాన్ని ప్రకటించారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
గత ఏప్రిల్‌లో పశ్చిమ ఉగాండాలో ఒక బస్సు అదుపు తప్పి, హైవేపై బోల్తా పడటంతో 10 మంది మరణించారు. అదేవిధంగా గత ఆగస్టులో ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 20 మంది మరణించారు. గత ఏడాది కంపాలా-గులు హైవేపై ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 26 మంది మృతిచెందారు. రెండేళ్ల క్రితం జనవరిలో కెన్యా-ఉగాండా సరిహద్దులో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందగా, 49 మంది గాయపడ్డారు.