
కొంత గ్యాప్ తర్వాత ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అగ్రరాజ్యంలో నడుస్తున్న నో కింగ్స్ నిరసనలను(No Kings Protest) ఉద్దేశించి తన ఎక్స్ ఖాతాలో ఓ సెటైరిక్ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇరాన్ అణుకేంద్రాలను నాశనం చేశానని ట్రంప్ కలలు కంటున్నారని ఖమేనీ అంటున్నారు.
ట్రంప్ నియంతృత్వ ధోరణి, ఆ దేశంలో పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలో No Kings నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఖమేనీ ఏమన్నారంటే.. ‘‘అమెరికాలో ఈ మనిషికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో 70 లక్షల మందికిపైగా నినాదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత సామర్థ్యమే ఉన్నప్పుడు.. అక్కడి ప్రజల ఆందోళనలు మాన్పించి ఇళ్లకు పంపొచ్చు కదా’’ అని అన్నారు.
According to the reports, seven million people are chanting slogans against this individual in different states across America. If you’re that capable, calm them down, send them back to their residences, and don't interfere in the affairs of other countries! pic.twitter.com/zAkusSWdQf
— Khamenei.ir (@khamenei_ir) October 21, 2025
ట్రంప్ పాలన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నగరాల్లో బలగాల మోహరింపు, పలు పథకాలకు ప్రభుత్వ నిధులను కత్తిరించడం లాంటి చర్యలను ఖండిస్తూ నో కింగ్స్ నిరసనలు జరిగాయి. అక్టోబర్ 18వ తేదీన అమెరికా 50 రాష్ట్రాల్లో.. 2,700 ఈవెంట్లలో లక్షల మంది పాల్గొన్నారు. అయితే దీనిని అమెరికా వ్యతిరేక ర్యాలీగా రిపబ్లికన్ పార్టీ అభివర్ణించింది. అంతేకాదు.. నిరసనకారులపై కోపం ప్రదర్శిస్తూ ఓ ఏఐతో కూడిన డీప్‌ఫేక్ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.
ఇక.. ఇరాన్‌తో చర్చల పునరుద్ధరణకు ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఖమేనీ చెబుతున్నారు. ‘‘ట్రంప్ తనను తాను డీల్‌మేకర్ అని చెప్పుకుంటారు. కానీ, బలవంతంగానో, బెదిరింపులతోనో జరిగేది అసలు ఒప్పందమే కాదు. అది దౌర్జన్యం కిందకు వస్తుంది. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరించా’’అని ఖమేనీ అన్నారు.
ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశామని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై ఖమేనీ స్పందిస్తూ..‘‘ మంచిది.. అలాగే కలలు కనమనండి’’అంటూ వ్యాఖ్యానించారాయన.
ఇరాన్ అణు కార్యక్రమాలతో తమ దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఈ ఏడాది జూన్‌లో దాడులకు దిగింది. ఆ వెంటనే అణు ఒప్పందం వంకతో అమెరికా బలగాలు కూడా ఇజ్రాయెల్‌కు తోడయ్యాయి. 12 రోజులపాటు ఇరువైపుల నుంచి దాడులు, ప్రతిదాడులతో భారీ నష్టమే వాటిల్లింది. చివరకు.. ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి అమెరికాతో నేరుగా అణు చర్చలు ఉండబోవంటూ ఖమేనీ చెబుతూ వస్తున్నారు.
ఇదీ చదవండి: అధ్యక్ష భవనం నుంచి ఇరుకు జైలు గదికి!