
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-48)అధ్వాన్నస్థితికి చేరడం, తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం, దీనికితోడు పరిపాలనా అధికారుల నిర్లక్ష్యానికి విసిగివేసారిన నైగావ్, చించోటి, వాసాయి ప్రాంతాలకు పలువురు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి రోడ్డుపై అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొనేకన్నా.. చావడమే మేలు అంటూ, తమకు చనిపోయేందుకు అనుమతినివ్వాలంటూ వారంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఎన్‌హెచ్-48 వెంబడి ఉన్న ససునావ్‌ఘర్, మల్జిపడ, ససుపడ, బోబత్ పడ,పథర్‌పడ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఒకప్పుడు ఈ మార్గంలో ఒక గంట ప్రయాణం చేసే సమయం ఇప్పుడు విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఐదు నుంచి ఆరు గంటలకు పెరిగిందని వారు మీడియాకు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జీవించడం కంటే చనిపోవడమే మంచిదని నిరసనలకు నాయకత్వం వహిస్తున్న స్థానిక ఎన్‌జీఓ కార్యకర్త సుశాంత్ పాటిల్ అన్నారు. ఆయన ప్రధాన మంత్రికి రాసిన లేఖలో.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇతర అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్థానికుల దైనందిన జీవితం అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. ఈ సమస్య గురించి అధికారులకు తెలియజేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని, వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని లేఖలో ఆయన కోరారు.
ఎన్‌హెచ్-48 మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటమే కాకుండా, గుంతలతో నిండిన రహదారి మరింత అస్తవ్యస్తంగా మారిందని, దీనికితోడు ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో నరకం కనిపిస్తున్నదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు కారణమైన అధికారులపై చర్య తీసుకునే వరకు గ్రామస్తులు నిరసన కొనసాగిస్తారని పాటిల్ తెలిపారు. థానేలోని గైముఖ్ ఘాట్ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనుల కారణంగా ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ సంబంధితన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటిని స్థానిక అధికారులు విస్మరించారని పాటిల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నిరసనల అనంతరం ఎంబీవీవీ పోలీసు కమిషనర్ నికేత్ కౌశిక్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. చించోటి ట్రాఫిక్ బ్రాంచ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హైవే ట్రాఫిక్ నిర్వహణ విధులను వాసాయి, విరార్ ట్రాఫిక్ బ్రాంచ్‌లకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.