
భోజనంలో సైడ్ డిష్‌గా కరకరలాడే అప్పడాలు ఉంటే అబ్బో ఆ భోజనం పొట్ట ఫుల్‌గా మనసు నిండుగా ఉంటుంది. అబ్బా.. తలుచుకుంటేనే నోరూరిపోయే ఈ అప్పడాలను ఇష్టపడని వారంటూ ఉండరు. చిన్నాపెద్ద అనే తేడాలేకుండా ఎంతో ఇష్టంగా తినే అప్పడాలు వాస్తవానికి అంత ఆరోగ్యకరమైనవి కాదు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులు అస్సలు తినకూడదు. అయితే అప్పడాలు వేయించిన ఘుమఘమకి నోరూరిపోతుంటుంది. తినకుండా ఉండాలంటే చాలా కష్టమే. అలాంటివాళ్లు వాటిని మిస్ చేసుకుంటున్నాం అనే బాధ లేకుండా హాయిగా తినే చక్కటి మార్గం ఏంటో.. పోషకాహార నిపుణుల మాటల్లో తెలుసుకుందామా..!.
మెటబాలిక్ హెల్త్ కోచ్ కరణ్ సారిన్ అప్పడాలంటే ఇష్టపడని వారెవరుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆరోగ్యకరంగా తినడం తెలిస్తే చాలు..అని అంటున్నారు. సాధారణంగా మినపప్పుతో చేసే ఈ అప్పడాలు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారని అన్నారు. అయితే మినపప్పు ఆరోగ్యానికి మంచిదే అయినా..ఇందులో వినియోగించే మసాలా, సోడియం, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ. అందువల్ల ఇది ఆరోగ్యానికి అంత మంచికాదని తేల్చి చెప్పారు.
అదీగాక దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల తీసుకుంటే రక్తంలో చక్కెర స్తాయిలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుందట. అయితే కాస్త తెలివిగా పరిమిత ప్రమాణంలో ఆరోగ్యకరంగా తింటే ఎలాంటి సమస్య ఉండదని నమ్మకంగా చెబుతున్నారు న్యూటిషనిస్ట్ కరణ్. అంతేగాదు అదెలాగా ప్రయోగాత్మకంగా వీడియో రూపంలో చూపించారు కూడా.
ఇది శుద్ధి చేసిన పిండే అయినప్పటికీ దీనిలో చక్కెర శాతం ఉండదు. కానీ ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్(GI) మాత్రం ఎక్కువే. అందుకని దీన్ని కూరగాయలు, సలాడ్‌ల రూపంలో తీసుకుంటే హెల్దీగా ఉంటుందట. అలా ఆయన స్వయంగా తిని చూపించారు.
అంతేగాదు రెండు గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా సమస్థాయిలో ఉన్నాయో స్పష్టంగా చూపించారు. దీన్ని చిరుతిండిలా ఉల్లిపాయలు, టమోటాలు, దోసకాయ, వంటి అధిక ఫైబర్ టాపింగ్స్‌తో జత చేసి హాయిగా తినేయొచ్చని అంటున్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అప్పడాలను ఇలా హెల్దీగా తినేయండి.
(చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..)