
గాజా ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు
ఇంధన కొరతతో మూతబడే పరిస్థితి
ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధనం ఫలితం
గాజా: దాదాపు రెండు నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధంలో ఉన్న గాజాలో హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆహారం, మందులు, అత్యవసర సరఫరాలతోపాటు నీరు, ఇంధన సరఫరాలను సైతం ఇజ్రాయెల్ ఆర్మీ అడ్డుకుంటోంది. హమాస్ తమపై దాడులకు ఇంధనాన్ని వాడుకుంటుందని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ సరఫరాలను అడ్డుకుంటోంది. ఈ చర్యతో జనం ఆకలి చావులకు గురవుతున్నారు. చిన్నారులకు సరైన వైద్యం అందడం లేదు. గాజా ప్రాంతంలోని ఆస్పత్రులను ఇప్పుడు ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది.
ఇజ్రాయెల్ దాడులతో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో ఆస్పత్రులు డీజిల్‌తో నడిచే జనరేటర్లపేనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇంధనం నిల్వలు అడుగంటుతుండటంతో ఆస్ప త్రుల్లోని ఒక్కో ఇంక్యుబేటర్‌లో నలుగురైదుగురు చిన్నారులను ఉంచాల్సి వస్తోందని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. గాజా ఆస్పత్రుల్లో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుందని ఐరాస సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
‘అదనంగా ఎటువంటి నిల్వలు లేకపోవడంతో ఆస్పత్రులు ఇంధనం వాడకంపై పరిమితులు పెట్టుకున్నాయి. ఇంధనం లేక ఇప్పటికే అంబులెన్సులు సైతం నిలిచిపోయాయి. నీటి సరఫరా వ్యవస్థలు పతన దశలో ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించకుంటే మరణాలు పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది’అని ఐరాస పేర్కొంది. ఇప్పటికి 11 వారాలుగా మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ సాగిస్తున్న దిగ్బంధంతో 20 లక్షలమందికి పైగా పాలస్తీ నియన్లు ఆకలి చావులకు చేరువలో ఉన్నారని తెలిపింది. మేలో పరిమితంగా ఆహార సరఫరా లను పునరుద్ధరించినా అవసరా లకు ఏమాత్రం సరిపోవని తెలిపింది.
ఇలాంటి చోట ఏ చిన్నారీ పుట్టకూడదు
ఒకే ఇంక్యుబేటర్‌పై నలుగురైదుగురు నవజాత శిశువులను ఉంచిన ఫొటోను గాజా సిటీలోని అల్–అహ్లి ఆస్పత్రి డైరెక్టర్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఇంక్యుబేటర్ సైతం అల్–హెలౌ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చిందేనని డైరెక్టర్ ఫదెల్ నయీం ‘ఎక్స్’లో తెలిపారు. గాజా దిగ్బంధం కారణంగా ఇక్కడి ఆరోగ్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయన్నారు. ‘నెలలు నిండకుండానే పుట్టిన శిశువులకు ఇది జీవన్మరణ విషయంగా మారింది. తాము చావాలో బతకాలో నిర్ణయించే బాంబు దాడులు, దిగ్బంధాలు నడిచే చోట ఏ ఒక్క చిన్నారీ పుట్టరాదు’అంటూ ఆయన ఆవేదన చెందారు.
ఇంధన కొరత కారణంగానే తాము కిడ్నీ డయాలసిస్ విభాగాన్ని మూసేశామని ఉత్తర గాజాలోని అల్–షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సిల్మియా చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్, ఆపరేషన్ థియేటర్లను మాత్రం నడిపిస్తున్నా మన్నారు. ఆస్పత్రిలోని జనరేటర్లు మరో మూడు గంటలపాటు మాత్రమే నడుస్తాయని, ఆ తర్వాత ఇంక్యుబేటర్లలోని 22 మంది శిశువులతోపాటు వందలాది మంది రోగులకు మరణమే శరణమన్నారు. రోగులకు వైద్య పరీక్షలు చేసేందుకు ఈ ఆస్పత్రి లోని వైద్యులు టార్చిలైట్లను వాడుతున్నారు.