breaking news
Incubator
-
ఒక్క ఇంక్యుబేటర్.. ఐదుగురు శిశువులు!
గాజా: దాదాపు రెండు నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధంలో ఉన్న గాజాలో హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆహారం, మందులు, అత్యవసర సరఫరాలతోపాటు నీరు, ఇంధన సరఫరాలను సైతం ఇజ్రాయెల్ ఆర్మీ అడ్డుకుంటోంది. హమాస్ తమపై దాడులకు ఇంధనాన్ని వాడుకుంటుందని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ సరఫరాలను అడ్డుకుంటోంది. ఈ చర్యతో జనం ఆకలి చావులకు గురవుతున్నారు. చిన్నారులకు సరైన వైద్యం అందడం లేదు. గాజా ప్రాంతంలోని ఆస్పత్రులను ఇప్పుడు ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో ఆస్పత్రులు డీజిల్‌తో నడిచే జనరేటర్లపేనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇంధనం నిల్వలు అడుగంటుతుండటంతో ఆస్ప త్రుల్లోని ఒక్కో ఇంక్యుబేటర్‌లో నలుగురైదుగురు చిన్నారులను ఉంచాల్సి వస్తోందని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. గాజా ఆస్పత్రుల్లో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుందని ఐరాస సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ‘అదనంగా ఎటువంటి నిల్వలు లేకపోవడంతో ఆస్పత్రులు ఇంధనం వాడకంపై పరిమితులు పెట్టుకున్నాయి. ఇంధనం లేక ఇప్పటికే అంబులెన్సులు సైతం నిలిచిపోయాయి. నీటి సరఫరా వ్యవస్థలు పతన దశలో ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించకుంటే మరణాలు పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది’అని ఐరాస పేర్కొంది. ఇప్పటికి 11 వారాలుగా మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ సాగిస్తున్న దిగ్బంధంతో 20 లక్షలమందికి పైగా పాలస్తీ నియన్లు ఆకలి చావులకు చేరువలో ఉన్నారని తెలిపింది. మేలో పరిమితంగా ఆహార సరఫరా లను పునరుద్ధరించినా అవసరా లకు ఏమాత్రం సరిపోవని తెలిపింది.ఇలాంటి చోట ఏ చిన్నారీ పుట్టకూడదుఒకే ఇంక్యుబేటర్‌పై నలుగురైదుగురు నవజాత శిశువులను ఉంచిన ఫొటోను గాజా సిటీలోని అల్–అహ్లి ఆస్పత్రి డైరెక్టర్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఇంక్యుబేటర్ సైతం అల్–హెలౌ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చిందేనని డైరెక్టర్ ఫదెల్ నయీం ‘ఎక్స్’లో తెలిపారు. గాజా దిగ్బంధం కారణంగా ఇక్కడి ఆరోగ్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయన్నారు. ‘నెలలు నిండకుండానే పుట్టిన శిశువులకు ఇది జీవన్మరణ విషయంగా మారింది. తాము చావాలో బతకాలో నిర్ణయించే బాంబు దాడులు, దిగ్బంధాలు నడిచే చోట ఏ ఒక్క చిన్నారీ పుట్టరాదు’అంటూ ఆయన ఆవేదన చెందారు. ఇంధన కొరత కారణంగానే తాము కిడ్నీ డయాలసిస్ విభాగాన్ని మూసేశామని ఉత్తర గాజాలోని అల్–షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సిల్మియా చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్, ఆపరేషన్ థియేటర్లను మాత్రం నడిపిస్తున్నా మన్నారు. ఆస్పత్రిలోని జనరేటర్లు మరో మూడు గంటలపాటు మాత్రమే నడుస్తాయని, ఆ తర్వాత ఇంక్యుబేటర్లలోని 22 మంది శిశువులతోపాటు వందలాది మంది రోగులకు మరణమే శరణమన్నారు. రోగులకు వైద్య పరీక్షలు చేసేందుకు ఈ ఆస్పత్రి లోని వైద్యులు టార్చిలైట్లను వాడుతున్నారు. -
ఆస్ట్రేలియా సంస్థతో ‘వుయ్ హబ్’ జట్టు
హైదరాబాద్: మహిళల స్టార్టప్ ఇన్క్యుబేటర్ ’వుయ్ హబ్’ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సైబర్ వెస్ట్ సైన్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇరు దేశాల్లోని అంకుర సంస్థలకు సీమాంతర అవకాశాలను కల్పించేందుకు ఇది ఉపయోగపడగలదని వుయ్ హబ్ సీఈవో దీప్తి రావుల తెలిపారు. ఈ ఎంవోయూతో మార్కెట్ విశ్లేషణ, పరిశ్రమ నెట్‌వర్క్‌లు, వనరుల వివరాలు మొదలైనవి అంకుర సంస్థలకు అందుబాటులోకి వస్తాయని ఆమె వివరించారు. వ్యాపార విస్తరణ అవకాశాల గురించి అవగాహన పెంచేందుకు సంయుక్తంగా ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు వంటివి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా వ్యాపారవేత్తల కోసం తెలంగాణ ప్రభుత్వం వుయ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. -
లక్నోలో అతిపెద్ద ఇంక్యుబేటర్
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను నెలకొల్పుతున్నట్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. లక్నోలో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర ప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజీవ్ షరన్ తెలిపారు. ఫిబ్రవరి 21–22 తేదీల్లో లక్నోలో జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఆహ్వానించేందుకు మంగళవారమిక్కడ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘యూపీలో ఇప్పటికే 2,000కుపైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ మాదిరి అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసి ఈ స్టార్టప్స్‌కు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. యూపీ కేంద్రంగా ఉన్న స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు రూ.1,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం’ అని వివరించారు. ఆవిష్కరణలకు దన్ను.. వివిధ రంగాల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి ఇండస్ట్రియల్ పాలసీకి రూపకల్పన చేశామని ఉత్తర ప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి సతీష్ మహానా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలు యూపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. కాగా యూపీలో పెట్టుబడులకు జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆసక్తి కనబరిచింది. ఎయిర్‌పోర్టులు, విద్యుత్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. జేవర్ విమానాశ్రయం అభివృద్ధికి సుముఖంగా ఉన్నట్టు జీవీకే డైరెక్టర్ పి.వి.ప్రసన్న రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. -
హైదరాబాద్, విజయవాడల్లో ఒరాకిల్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు
ముంబై: ఐటీ దిగ్గజం ఒరాకిల్ దేశవ్యాప్తంగా తొమ్మిది స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్, విజయవాడలతో పాటు మరో ఆరు నగరాల్లో ఒరాకిల్ స్టార్టప్ క్లౌడ్ యాక్సిలిటరేర్ పేరుతో ఈ స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నామని ఒరాకిల్ సంస్థ తెలిపింది. వృద్ధిలోకి వస్తున్న ఎంటర్ప్రెన్యూర్లకు తగిన మార్గదర్శకత్వం అందించడం, వృద్ధి చెందుతున్న కంపెనీలకు ఉత్తమ టెక్నాలజీని అందించడం లక్ష్యాలుగా ఈ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. క్లౌడ్ టెక్నాలజీ పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఉపయోగపడేలా చూడడం, దేశాన్ని మార్చే బిజినెస్ ఐడియాలున్న ప్రతి వ్యక్తి క్లౌడ్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని ఒరాకిల్ ప్రెసిడెంట్ థామస్ కురియన్ చెప్పారు. చిన్న సంస్థలకు మార్గదర్శకత్వం వహించడం కీలకమైన అంశమని, విజయవంతమైన స్టార్టప్‌లను నిర్వహించిన సీఈఓలు, వెంచర్ క్యాపిట్ పండ్స్ సూచనలు, సలహాలను ఈ ఇంక్యుబేటర్లు అందిస్తాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సేవలందిస్తున్నప్పటికీ ఇలాంటి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. బెంగళూరులో తొలి స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను నేడు(శుక్రవారం) ఏర్పాటు చేస్తామని కురియన్ తెలిపారు. -
పరిశ్రమలకు ‘మహాభాగ్య’నగరి: కేటీఆర్
హైదరాబాద్: దేశంలోనే హైదరాబాద్‌ను పారిశ్రామికంగా మొదటిస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఐటీ,పంచాయతీరాజ్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు( కేటీఆర్) తెలిపారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా-9 ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పెట్టుబడులు, వ్యాపారాలు అనువైన పరిస్థితులపై విశ్లేషించేందుకు, సందేహాలు నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలో ఐటీ, ఫార్మా, బల్క్‌డ్రగ్, బయోటెక్నాలజీ, సీడ్, పౌల్ట్రీ పరిశ్రమలు విస్తరించాయన్నారు. ఆయారంగాల్లో మరిన్ని పెట్టుబడులను తాము ఆహ్వానిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఐఎస్బీ, ఐఐఐటీలతో కలసి దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు రూపకల్పన చేస్తామన్నారు. హైదరాబాద్‌ను వైఫై నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే ఆలోచనలో ఉన్నామని, తద్వారా నగరఖ్యాతిని పెంపొందించడమే కాకుండా ఆకర్షణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. లక్షకుపైగా ఇంజనీరింగ్ తదితర గ్రాడ్యుయేట్లు ప్రతి ఏటా ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారని వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం సంధానకర్తగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రౌంట్ టేబుల్ ఇండియా 9 ప్రతినిధులు రియాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.