ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌: ‘అవును..’ బిల్‌గేట్స్‌ సంచలన వాంగ్మూలం! | Epstein Files: Bill Gates Admits Affairs Raises Blackmail Fears | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌: ‘అవును..’ బిల్‌గేట్స్‌ సంచలన వాంగ్మూలం!

Jun 24 2026 1:54 PM | Updated on Jun 24 2026 2:03 PM

Epstein Files: Bill Gates Admits Affairs Raises Blackmail Fears

ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో.. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు బిల్‌ గేట్స్‌ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో అమెరికా కాంగ్రెస్‌ కమిటీ ఎదుట ఆయన ఇచ్చిన ‘రహస్య’ వాంగ్మూలం ఇప్పుడు బయటకు రావడం సంచలనంగా మారింది. అందులో.. తనకు ముగ్గురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించిన గేట్స్‌..  జెఫ్రీ ఎప్‌స్టీన్‌ తనను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చని ఆరోపించారు!.

అమెరికా ప్రతినిధుల సభ పర్యవేక్షణ కమిటీ (హౌస్‌ ఓవర్‌సైట్‌ కమిటీ) ఎప్‌స్టీన్‌ నెట్‌వర్క్‌, అతడి పరిచయాలపై దర్యాప్తు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూన్‌ 10న బిల్‌ గేట్స్‌ స్వచ్ఛందంగా కమిటీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా విడుదలైన ట్రాన్స్‌క్రిప్ట్‌తో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గేట్స్‌ ఏం చెప్పినట్లు ఉందంటే.. రష్యాకు చెందిన బ్రిడ్జ్‌ క్రీడాకారిణి మిలా ఆంటోనోవా, అణు భౌతిక శాస్త్రవేత్త కరీమా నిగ్మతులినా, వైద్య రంగ పారిశ్రామికవేత్త అలిస్‌ జాకబ్స్‌ నెసెల్‌రోట్‌లతో తనకు సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే ఈ వ్యక్తిగత వ్యవహారాలకు ఎప్‌స్టీన్‌తో ఉన్న పరిచయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. "ఆ సంబంధాలు నా కుటుంబానికి బాధ కలిగించాయి. కానీ ఎప్‌స్టీన్‌ వాటికి సంబంధించిన సమాచారంతో పాటు మరికొన్ని అబద్ధాలను కలిపి నాపై ఒత్తిడి తీసుకురావాలని చూశాడు" అని గేట్స్‌ పేర్కొన్నారు.

బ్లాక్‌మెయిల్‌కు ప్రయత్నించాడా?
కమిటీ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ గేట్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్‌స్టీన్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి తనపై ప్రభావం చూపాలని భావించి ఉండొచ్చని చెప్పారు. "అతడు నన్ను ఎప్పుడూ బ్లాక్‌మెయిల్‌ చేయలేదు. కానీ బయటకు వచ్చిన కొన్ని ఈమెయిల్స్‌ను చూస్తే, అలా చేయాలనే ఆలోచన అతడికి ఉండి ఉండొచ్చనే అనుమానం కలుగుతోంది" అని వ్యాఖ్యానించారు.

2014లో ఎప్‌స్టీన్‌తో సంబంధాలు తెంచుకున్న తర్వాత, తాను సంబంధం పెట్టుకున్న ఓ మహిళకు ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరుతూ ఎప్‌స్టీన్‌ ఈమెయిల్‌ పంపినట్లు కూడా గేట్స్‌ వెల్లడించారు. అయితే తాము ఒక్క పైసా కూడా చెల్లించబోమని తన బృందానికి స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.

బాధితుల సమక్షంలో ఉన్నానేమో...
వాంగ్మూలంలో అత్యంత కీలకంగా మారిన అంశం ఇదే. ఎప్‌స్టీన్‌ బాధితుల్లో కొందరు అతడి ఉద్యోగులుగానూ పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందని కమిటీ సభ్యులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన గేట్స్‌.. ఎప్‌స్టీన్‌ విమానంలో జరిగిన ఒక సమావేశం ముగిసిన తర్వాత కొందరు మహిళా ఉద్యోగులను చూసినట్లు గుర్తు చేసుకున్నారు. "అది మంచి పాయింట్‌. నేను ఎప్‌స్టీన్‌ బాధితుల సమక్షంలో ఉండి ఉండొచ్చు" అని అంగీకరించారు. అయితే తాను ఎప్పుడూ ఎలాంటి లైంగిక వేధింపులను ప్రత్యక్షంగా చూడలేదని, అలాంటి ఘటనల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు.

ఎస్‌టీడీ ఆరోపణలపై స్పందన
ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పత్రాల్లో బిల్‌ గేట్స్‌కు లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే వ్యాధి (ఎస్‌టీడీ) సోకిందనే అనుమానం వ్యక్తమైందని, దానికి సంబంధించిన మందులు రహస్యంగా అందించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన గేట్స్‌.. "నాకు ఎప్పుడూ ఎలాంటి ఎస్‌టీడీ రాలేదు. అలాంటి వ్యాధి సోకిందేమోనని ఆందోళన కలిగి ఉండొచ్చు. కానీ నాకు ఎప్పుడూ అలాంటి వ్యాధి లేదు. రహస్యంగా మందులు కూడా తీసుకోలేదు" అని స్పష్టం చేశారు.

ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఎలాగంటే..
2011లో తనకు అత్యంత విశ్వసనీయ సహచరుడైన డాక్టర్‌ బోరిస్‌ నికోలిక్‌ ద్వారా ఎప్‌స్టీన్‌తో పరిచయం ఏర్పడిందని గేట్స్‌ తెలిపారు. అప్పటికే ఎప్‌స్టీన్‌కు లైంగిక నేరాలకు సంబంధించిన శిక్ష పడిన విషయం తనకు తెలుసని అంగీకరించారు. అయినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాల కోసం బిలియన్ల డాలర్ల నిధులు సమీకరించగలనని ఎప్‌స్టీన్‌ చెప్పడంతో అతడితో వృత్తిపరమైన సంబంధాలు కొనసాగించినట్లు వివరించారు. నాలుగేళ్ల వ్యవధిలో 12 నుంచి 14 సార్లు ప్రత్యక్షంగా, రెండు సార్లు వీడియో కాల్స్‌లో మాట్లాడినట్లు చెప్పారు.

అయితే ఎప్‌స్టీన్‌ చెప్పిన వాగ్దానాలు ఏవీ నెరవేరలేదని, అతడితో పరిచయం కొనసాగించడం జీవితంలో చేసిన తప్పిదాల్లో ఒకటిగా భావిస్తున్నానని గేట్స్‌ పేర్కొన్నారు.

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ఏముంది?
అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన అదనపు పత్రాలు, ఈమెయిల్స్‌, ఫొటోలు ఈ వ్యవహారాన్ని మరోసారి వార్తల్లోకి తెచ్చాయి. ఆ పత్రాల్లో బిల్‌ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు, ఎప్‌స్టీన్‌తో జరిగిన సంప్రదింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. గేట్స్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే అందులోని మహిళల పేర్లను గోప్యంగా ఉంచారు.

ఇక ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈమెయిల్స్‌లో ఎప్‌స్టీన్‌, గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన కొంతమంది సిబ్బంది మధ్య సంభాషణలు కూడా వెలుగుచూశాయి. దీంతో గేట్స్‌ ఫౌండేషన్‌ గతంలో ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలపై ప్రత్యేక బాహ్య సమీక్ష ప్రారంభించినట్లు ప్రకటించింది.

అదే సమయంలో కమిటీ మరో ట్రాన్స్‌క్రిప్ట్‌ను కూడా విడుదల చేసింది. అందులో ఎప్‌స్టీన్‌ దీర్ఘకాల సహాయకురాలు లెస్లీ గ్రాఫ్‌.. తన మాజీ యజమానిని "మాస్టర్‌ మానిప్యులేటర్‌"గా అభివర్ణించింది. అయితే అతడి నేరాల గురించి తనకు తెలియదని చెప్పింది. ఎప్‌స్టీన్‌, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఫోన్‌ సంభాషణలకు తానే అనేకసార్లు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కూడా ఆమె వెల్లడించింది.

ఎందుకు ప్రాధాన్యం..?
ప్రముఖ ఫైనాన్షియర్‌ అయిన ఎప్‌స్టీన్‌ లైంగిక ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్‌ అయ్యారు. అయితే 2019లో ఎప్‌స్టీన్‌ జైలులో మృతిచెందినా.. అతడి పరిచయ వలయం, ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన వ్యక్తులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజా వాంగ్మూలంతో బిల్‌ గేట్స్‌ వ్యక్తిగత జీవితం, ఎప్‌స్టీన్‌తో అతడి పరిచయాలు, బ్లాక్‌మెయిల్‌ ఆరోపణలు, బాధితుల సమక్షంలో ఉండి ఉండొచ్చన్న అంగీకారం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ప్రపంచ ప్రముఖులపై ఎప్‌స్టీన్‌ వద్ద ఎంత సమాచారం ఉండేది, ఆ సమాచారం ద్వారా అతడు ఎంత ప్రభావం చూపగలిగాడన్న ప్రశ్నలకు ఈ కేసు కొత్త కోణాన్ని జోడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement