
వాషింగ్టన్: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అంటూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన.. తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది.
‘ది అమెరికా పార్టీ’ (the america party) అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్, ఆ పార్టీకి రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేశారు. కానీ మస్క్ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా.. ?లేక జనాల్ని వెర్రివాళ్లను చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
ఎందుకంటే.. అమెరికన్ చట్టాల ప్రకారం..ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు. దీంతో మస్క్ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే.. కొత్త పార్టీ లేదు. ఏమీ లేదు. తూచ్ అని పక్కకు తప్పుకుంటారా? అని చూడాల్సి ఉండగా..
మస్క్ సౌతాఫ్రికన్ పౌరుడు
మస్క్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం.. ఆర్టికల్ 2, సెక్షన్ 1 ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి. తద్వారా మస్క్‌కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా కావడం.
మస్క్ పార్టీపై సవాలక్ష ప్రశ్నలు
ఈ నేపథ్యంలో, మస్క్ పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ.. మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా? పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా? అనేది సదరు అమెరికన్ పౌరుల్లో పుట్టుకొస్తున్న సవాలక్ష ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
మస్క్‌కే మద్దతు
ఈ క్రమంలో మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు? అందుకు గల కారణాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు. కొత్త పార్టీకి మద్దతుగా 1.2మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు. దాదాపు 80 శాతం మంది మస్క్‌కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
త్వరలోనే పార్టీ లోగో ప్రకటన
పార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసినా.. పార్టీ గుర్తును రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు కానీ.. ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది ఎన్నికల్లో మస్క్ పోటీ
ఇక వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే తన పార్టీ ఉద్దేశమనే నినాధాలతో ప్రజల్లోకి వెళ్లనుంది.
ఎన్నికల్లో మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహం
అమెరికాలో ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుల పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభ (House of Representatives) లోని 435 స్థానాలకు, సెనేట్ (Senate) లోని 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేయకుండా.. కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి.
మస్క్ ముందున్న సవాళ్లు
కాగా,మస్క్ సంపద, ప్రభావం ఉన్నప్పటికీ, మూడో పార్టీగా ఎదగడం సవాలుతో కూడుకున్నదే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరుఫున మస్క్ ప్రచారం చేశారు. ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను. ఎందుకంటే? నేను సౌతాఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరిన్. నేను ఆఫ్రికన్. కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. మస్క్‌కు ఎలక్షన్ ఎర్రి ఉందంటూ మండిపడుతున్నారు.