సాక్షి,నల్లగొండ: నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న గుమ్ముల మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై విమర్శలు గుప్పించారు. ‘రేవంత్ రెడ్డి నా గొంతు కోశారు. ప్రతిసారి డీసీసీ పదవి అడిగినా మొండిచెయ్యి చూపించారు. పార్టీకి నష్టం చేసే వాళ్లను వెంట తిప్పుకోవడం మేము అసలు సహించము. కాంగ్రెస్‌లో తిడితేనే పదవులు వస్తున్నాయి. తన కులం, సీనియారిటీ, సేవలను పక్కన పెట్టి తనను పరిగణనలోకి తీసుకోలేదని మోహన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిని కాబట్టి నాకు అడ్డుపడ్డారు. నా సీనియారిటీ, నా సర్వీస్ ఏం పనికిరాలేదా? ఎవరిని నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కన పెట్టారు.
డీసీసీ నియామకంలో అధిష్టానం కుల ఆధారిత నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు కూడా మోహన్ రెడ్డి చేశారు. తన తర్వాత వచ్చిన 20 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారని, వలస వచ్చిన నాయకులకే కాంగ్రెస్‌లో పెద్దపీట వేస్తున్నారు. అంతేకాక తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి తలుచుకుంటే 24 గంటల్లో నాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి వస్తుంది. రేవంత్ వెంట తిరిగితే నాకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు వచ్చేవి. నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు.
మునుగోడు ఉపఎన్నికల సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తాను సపోర్ట్ చేయలేదని, అప్పటికే తనపై అనవసర అపోహలు సృష్టించారని’ధ‍్వజమెత్తారు. తాజా గుమ్మల మోహన్‌రెడ్డి కామెంట్స్‌తో డీసీసీ పదవి చుట్టూ వచ్చిన ఈ ఆరోపణలు జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి, వర్గపోరు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


