
క్యాలెండర్‌లో తేదీ మారింది. ఎట్టకేలకు జపాన్ ఊపిరి పీల్చుకుంది. ఏదో విపత్తు ముంచేస్తోందని ‘జపాన్ బాబా వాంగా’ ర్యో తత్సుకి చెప్పిన కాలజ్ఞానం ఉత్తదేనని తేలిపోయింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా జపాన్ డూమ్స్ డే.. చివరకు హుళక్కే అని తేలింది.
జులై 5, 2025న మెగా సునామీ జపాన్‌ను ముంచెత్తబోతోందన్న ప్రచారం.. ఉత్తి ఉత్కంఠగానే తేలిపోయింది. భారీ భూకంపంగానీ.. సునామీగానీ సంభవించలేదు. కొన్ని స్వల్ప ప్రకంపనలు, అగ్నిపర్వతం బద్దలు మినహా ఓ మోస్తరు ప్రకృతి వైపరిత్యాలు సంభవించలేదు. తేదీ మారినా.. ఏం జరగకపోవడంతో ఆ దేశ ప్రజలు హమ్మయ్యా.. అనుకుంటున్నారు.
1999లో ప్రచురించబడిన ఓ మాంగా (The Future I Saw) రచయిత ర్యో తత్సుకి.. జులై 5వ తేదీన విపరీతమైన భూకంపం, యుగాంతం తరహాలో సునామీ ముంచెత్తవచ్చని తన చిత్రాలతో బొమ్మలు గీసింది.
మీడియాతో పాటు సోషల్‌మీడియాలోనూ జపాన్ డూమ్స్ డే అంటూ హడావిడి నడిచింది. #JapanTsunami, #July5, #TheFutureISaw వంటివి ట్రెండింగ్ అయ్యాయి. కొంతమంది పర్యాటకులు పర్యటనలు రద్దు చేసుకున్నారు. అందులో భారత్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. జపాన్ లోని ఆకుసెకిజిమా వాసులను అప్రమత్తంగా తరలించాల్సి వచ్చింది.
అయితే.. మేధావులు, సైంటిస్టులు.. ఆ భవిష్యవాణి నిరాధారమైనదిగా చెబుతూనే వస్తున్నారు. మరోవైపు అక్కడి వాతావరణ విభాగం కూడా.. భూకంపాలను అంచనా వేయలేమని మొత్తుకుంటూ వచ్చింది. చివరకు అదే నిజమని తేలింది.