వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాను టార్గెట్ చేశారు. కెనడాపై విరుచుకుపడ్డారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ట్రుత్ వేదికగా.. గ్రీన్‌లాండ్‌పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ గోల్డెన్ డోమ్ కెనడాను రక్షిస్తుంది. అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్.. కెనడాను రక్షించబోతోంది. కెనడా మా నుండి చాలా ఉచితాలను పొందుతుంది. అమెరికా కారణంగానే కెనడా మనుగడ సాగిస్తోంది. వారు కూడా కృతజ్ఞతతో ఉండాలి. అలా కాకుండా అమెరికాతో సంబంధాలను తెంచుకుకుంటున్నారు. బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకు కెనడా ఆమోదం తెలిపింది. చైనాకు అనుకూలంగా ఓటు వేశారు. మొదటి సంవత్సరమే కెనడాను చైనా తినేస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చైనాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి బీజింగ్‌ను సందర్శించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా మద్దతు కారణంగానే కెనడా మనుగడ సాగిస్తుందనే ట్రంప్ వాదనను తిరస్కరించారు. ఈ క్రమంలో మార్క్ కార్నీ మాట్లాడుతూ..‘కెనడాకు అమెరికాతో సంబంధమే లేదు. మనం కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతుంది. కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. కెనడాకు మనమే యజమానులం. ఇది మన సొంత దేశం. ఇది మన భవిష్యత్తు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, దావోస్‌లో ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే చిన్న దేశాల పట్ల గొప్ప శక్తులు బలవంతం చేయడాన్ని కార్నీ తప్పుబట్టారు.


