
పోరాటానికి ఈయూ, నాటో సాయమందిస్తాయి
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఐక్యరాజ్యసమితి: రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధాన్ని ముగించాలంటే కొంత భూభాగాన్ని కోల్పోక తప్పదంటూ ఉక్రెయిన్‌పై ఆయన ఒత్తిళ్లు చేయడం తెల్సిందే. తాజాగా, ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. నాటో సాయంతో రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్నంతటినీ ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు.
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపిన అనంతరం మంగళవారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ విషయం ప్రకటించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. ‘యూరోపియన్ యూనియన్ సాయంతో ఉక్రెయిన్ పోరాడి కోల్పోయిన భూభాగాన్నంతటినీ తిరిగి గెలుచుకునే స్థాయిలో ఉందన్నది నా నమ్మకం.
యూరప్, ముఖ్యంగా నాటో ఆర్థిక దన్నుతో ఈ యుద్ధం మొదలైనప్పుడు ఉన్న సరిహద్దులను తిరిగి ఉక్రెయిన్ సాధించుకోవడమే ఉత్తమమైన ఆప్షన్’అని అందులో పేర్కొన్నారు. ‘లక్ష్యమంటూ లేకుండా మూడున్నరేళ్లుగా రష్యా యుద్ధం సాగిస్తోంది. ఫలితంగా భారీ సైనిక శక్తి కలిగిన ఆ దేశం కనీసం గెలవలేని పరిస్థితికి చేరుకుంది. నేడున్నది ఘనమైన రష్యా కాదు.
కేవలం కాగితం పులి మాత్రమే’అని వ్యాఖ్యానించారు. పుతిన్, రష్యా తీవ్ర ఆర్థిక సమస్యల్లో మునిగి ఉన్నందున ఉక్రెయిన్‌కు ఇదే సరైన అదను అని తెలిపారు. ట్రంప్ తన హామీకి కట్టుబడి ఉంటే మాత్రం యుద్ధాన్ని ముగించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తేవాలంటూ పదేపదే కోరుతూ వచ్చిన జెలెన్‌స్కీ తన ప్రయత్నాల్లో విజయం సాధించినట్లేనని పరిశీలకులు అంటున్నారు.
ట్రంప్ గేమ్ ఛేంజర్: జెలెన్‌స్కీ
ట్రంప్ నిజంగా గేమ్ ఛేంజర్ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ట్రంప్ పిలుపు మేరకు యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతులను ఆపేయాలన్నారు. ఉక్రెయిన్ చేస్తున్న పోరాటాన్ని మనం గౌరవించా ల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించగా, యు ద్ధక్షేత్రం నుంచి మంచి వార్త అందిందంటూ జెలెన్‌స్కీ తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించం: రష్యా
రష్యాకు కోల్పోయిన భూభాగాలను తిరిగి గెలుచుకునే సత్తా ఉక్రెయిన్‌కు ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యలను రష్యా తీవ్రంగా ఖండించింది. తమ దేశం యూరప్ భద్రతలో విడదీయరాని భాగమని రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం కారణాలు, పరిష్కారాలపై జెలెన్‌స్కీ చెప్పిన మాట లను విని, అవే నిజమని ట్రంప్ నమ్ముతు న్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు చెప్పిన ఏ ఒక్క అంశంతోనూ తాము ఏకీభవించడం లేద న్నారు.