రావణకాష్టంగా ఇరాన్‌ | Death toll from Iranian protests surpasses 2000 | Sakshi
Sakshi News home page

రావణకాష్టంగా ఇరాన్‌

Jan 14 2026 2:02 AM | Updated on Jan 14 2026 2:04 AM

Death toll from Iranian protests surpasses 2000

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో 2,003కు పెరిగిన మరణాల సంఖ్య

పలు బ్యాంక్‌లు, దుకాణాలు దగ్ధం

ఇంటర్నెట్, ఆన్‌లైన్, మొబైల్‌ సేవలు బంద్‌

దుబాయ్‌/వాషింగ్టన్‌: ఇరాన్‌లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వాణిజ్య సము దాయాలు, బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు. ఉద్యమ వార్తలు, పుకార్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు అయతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ఇరాన్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్‌ సేవలను స్తంభింపజేసింది. అయితే నాలుగు రోజుల తర్వాత కొందరికి మాత్రం అంతర్జాతీయ ఫోన్‌కాల్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో గత రెండు వారాలుగా తాము పడుతున్న బాధలు, నరకయాతనను పలువురు విదేశాల్లోని తమ బంధువుల ముందు ఏకరవు పెట్టారు. సెంట్రల్‌ టెహ్రాన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు మొహరించారని దుబాయ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని బంధువులకు చెప్పారు.

ఆన్‌లైన్‌ సదుపాయం లేక బ్యాంక్‌లలో నగదు లావాదేవీలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుండటంతో జనాలకు కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమకారులను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేస్తూ కాల్పులు జరుపుతుండటంతో ఉద్యమసంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 2,003 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌ న్యూస్‌ ఏజెన్సీ’ మంగళవారం ప్రకటించింది. వీరిలో 1,850 మంది ఉద్యమకారులుకాగా 135 మంది పోలీసులు ఉన్నారు. అభంశుభం తెలియని 9 మంది చిన్నారులు, ఉద్యమంలో పాల్గొనని 9 మంది సాధారణ జనం సైతం కాల్పుల్లో కన్నుమూశారు. మరోవైపు అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేస్తే ఇరాన్‌ సైతం ప్రతిదాడులకు దిగడం ఖాయమన్న అంచనాలతో ఇరానియన్లు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనల ధాటికి దుకాణాలు మూతబ డుతున్నాయి. నిరంకుశ, ఛాందసవాద ఖమేనీ గద్దె దిగి ప్రజాస్వామ్యయుత పాలన కావాలంటూ వేలాదిగా జనం వీధుల్లో నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన ఖమేనీ సర్కార్‌ పోలీసులను రంగంలోకి దింపి లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగం, తప్పనిసరి పరిస్థితుల్లో తుపాకులకు పనిచెప్తోంది. పోలీసులు, ఉద్యమకారులకు మధ్య ఘర్షణల్లో వేలాది మంది గాయపడ్డారు. గత రెండువారాల వ్యవధిలో 10,700 మందికిపైగా నిరసనకారులను ప్రభుత్వం అరెస్ట్‌చేసింది.

ఉద్యమకారుడు ఇర్ఫాన్‌ను ఉరితీస్తాం..
సుప్రీంకమాండర్‌ ఖమేనీని దూషిస్తూ గత గురువారం జరిగిన నిరనస ర్యాలీలో పాల్గొన్న నేరానికి 26 ఏళ్ల ఉద్యమకారుడు ఇర్ఫాన్‌ సొల్తానీని బుధవారం ఉరితీస్తామని ఖమేనీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అన్యాయంగా ఇర్ఫాన్‌ను ప్రభుత్వం బలితీసుకుంటోందని, అంతర్జాతీయ సమాజం ఈ దారుణాన్ని అడ్డుకోవాలని ‘హెంగ్వా ఆర్గనైజేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’ సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. టెహ్రాన్‌ శివారు కరాజ్‌లోని ఫర్దీస్‌ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్‌ను జనవరి 8వ తేదీన పోలీసులు అరెస్ట్‌చేశారు. దేవునిపై యుద్ధం ప్రకటించాడని ఇర్ఫాన్‌పై నేరాభియోగాలు మోపి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎక్కువైంది. ఒక పౌరుడి ప్రాణాలు తీసేందుకు ఖమేనీ ప్రభుత్వం నిర్ణయాలు తీసు కుని  ఆగమేఘాల మీద అమలు చేయడం జీవితంలో ఎప్పుడూ చూడలేదని టెహ్రాన్‌వాసులు అసహనం వ్యక్తంచేశారు. ఇర్ఫాన్‌ను చివరిసారిగా కలిసేందుకు 11వ తేదీన కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు. ఇర్ఫాన్‌ సోదరి స్వయంగా న్యాయవాది అయినా కూడా ఆమె ఈ కేసు వాదించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ఇరాన్‌లో ఉంటున్న తమ పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని అమెరికా మంగళవారం ఒక అడ్వైజరీని జారీచేసింది.

నేనున్నా.. రెచ్చిపోండి: ట్రంప్‌
ఆందోళనలను మరింత రెచ్చగొట్టేలా ట్రంప్‌ మాట్లాడారు. ఈ మేరకు ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘ ఇరానియన్లు దేశ భక్తులు. నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేయండి. రాజ్యాంగబద్ధ సంస్థలను మీ వశం చేసుకోండి. హంతకులు, దాడులు చేసే వారి పేర్లను రాసిపెట్టుకోండి. మనందరం కలిసి వాళ్ల అంతుచూద్దాం. దాడులకు వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దారుణ హత్యోదంతాలు ఆగేదాకా ఇరాన్‌ ప్రభుత్వంతో నేను ఎలాంటి చర్చలు జరపబోను. అందుకే ఇరాన్‌ అత్యున్న తాధికారులతో అన్నిరకాల సమావేశాలను మంగళవారం రద్దు చేసుకున్నా. మీకు సాయం చేయబోతున్నాం. త్వరలోనే మీకు మా సాయం అందుతుంది. మేక్‌ ఇరాన్‌ గ్రేట్‌ ఎగేన్‌’’ అని ట్రంప్‌ రాసుకొచ్చారు. అయితే సాయం ఏ రూపంలో చేయబోతున్నారో ట్రంప్‌ వెల్లడించలేదు. అయితే అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌తో ఫోన్‌లో మంతనాలు జరుపుతున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement