2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల అరెస్టులపై కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్ (CPJ) నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 2025 డిసెంబర్‌లో అరెస్టైన జర్నలిస్టుల సంఖ్య 300కు పైగా ఉన్నట్లు పేర్కొంది. దీనిలో అత్యధికంగా చైనా 50 మంది పాత్రికేయులను బంధించినట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయుల అక్రమ నిర్భందాలు ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్ధం పడుతున్నాయి. 300సంఖ్య దాటి అరెస్టులు జరగడం ఇది వరుసగా ఐదవ సారని CPJ నివేదిక పేర్కొంది. పాత్రికేయుల అరెస్టులలో చైనా అధికంగా 50, మయన్మార్ 30, ఇజ్రాయెల్ 29 అరెస్టులు ఉన్నట్లు తెలిపింది. రష్యా 27, బెలారస్ 25, అజర్‌బైజాన్ 24 తరువాతి స్థానాలలో ఉన్నట్లు పేర్కొంది.
ఇప్పటి వరకూ జర్నలిస్టులు అధికంగా 1992 సంవత్సరంలో 384 మంది అరెస్టు కాగా ప్రస్తుతం 2025 మూడవ అత్యధిక అరెస్టులు జరిగిన సంవత్సరమని CPJ తెలిపింది. అయితే అరైస్టైన జర్నలిస్టులలో దాదాపు సగంమందికి పైగా ఎటువంటి నేరం చేయకుండానే అక్రమంగా నిర్భందించినట్లు న్యూయార్క్‌కు చెందిన ఒక ఎన్జీవో సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది.
అంతేకాకుండా జైలులో 20 శాతం తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. జర్నలిస్టులను హింసించే దేశాలలో ఇరాన్, ఇజ్రాయెల్, ఈజిప్టు ముందు వరుసలో ఉంటాయని కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్ నివేదిక తెలిపింది.


