
విద్యార్థుల వీసా రద్దుపై విదేశాంగ శాఖ ఆగ్రహం
బీజింగ్: కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న నెపంతో తమ విద్యార్థుల వీసాలను రద్దు చేసిన అమెరికా చర్యను చైనా ఖండించింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే రాజకీయం ప్రేరేపిత వివక్షతో కూడిన చర్యని పేర్కొంది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ గురువారం తీవ్రంగా స్పందించారు.
ఈ విషయంపై చైనా అమెరికాలో ఉన్న తమ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. అమెరికా చెప్పుకునే స్వేచ్ఛ, నిష్కపట విలువలు బూటకమని వ్యాఖ్యానించారు. ఇది అమెరికా ప్రతిష్టను, విశ్వసనీయతను మరింత దెబ్బతీస్తుందన్నారు. ‘జాతీయ భద్రత సాకుతో చైనా విద్యార్థుల వీసాలను అన్యాయంగా రద్దు చేయడం వారి చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసింది.
రెండు దేశాల మధ్య సాధారణ ప్రజల మధ్య రాకపోకలకు కూడా అంతరాయం కలిగిస్తుంది. ఈ చర్యలను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది’అని ప్రకటించారు. కాగా, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్న వారితో సహా కొన్ని కీలకమైన రంగాలలో చదువుతున్న చైనా విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేస్తుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం ప్రకటించారు.
గందరగోళంలో విద్యార్థుల భవితవ్యం
ఇప్పటికే అమెరికాలో విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న అనిశి్చతికి తోడుగా వెలువడిన ఈ ప్రకటనతో చైనీస్ విద్యార్థులు భవితవ్యం గందరగోళంలో పడింది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ తరువాత రెండో అతిపెద్ద దేశం చైనా. 2023–2024 విద్యా సంవత్సరంలో 270,000 కంటే ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులు చైనా నుంచే వచ్చారు. ఇది యూఎస్‌లోని మొత్తం విదేశీ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు.
విదేశాలలో చదువుతున్న చైనా విద్యార్థుల సమస్య చాలా కాలంగా ద్వైపాక్షిక సంబంధంలో ఉద్రిక్తతకు దారితీసింది. ట్రంప్ మొదటి పదవీకాలమైన 2019లో వీసాల తగ్గింపు, తిరస్కరణల రేట్లు పెరగడంతో విద్యార్థులను చైనా విద్యా శాఖ విద్యార్థులను హెచ్చరించింది. ఇక గతేడాది అమెరికా చేరుకున్న అనేక మంది చైనా విద్యార్థులను అన్యాయంగా విచారించి విమానాశ్రయాల నుంచి వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో కోవిడ్ తరువాత చాలామంది చైనా విద్యార్థులు యూకే వైపు మొగ్గుచూపుతున్నారు.
మరోవైపు హాంకాంగ్ సైతం చైనా విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. హార్వర్డ్‌కు విదేశీ విద్యార్థులను చేర్చుకునే మోదాను రద్దు చేసిన తరువాత.. ఆ విద్యార్థులను ఆహా్వనిస్తూ పోస్ట్‌చేసింది. అయితే.. వీసా రద్దులు అమెరికాకు మేలు చేయవని, ఇది చైనా అభివృద్ధికే సానుకూల మార్పు కావచ్చని బీజింగ్‌లో విద్యావేత్తలు అంటున్నారు. ప్రతిభావంతులైన వ్యక్తులు సింఘువా లేదా పెకింగ్ విశ్వవిద్యాలయంలో లేదా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌తోపాటు చైనాలోని ఇతర అగ్రశ్రేణి సంస్థల్లో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది దేశీయ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు.