‘డ్రాగన్ మార్క్’ప్రతీకారం: జపనీస్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం | China adds more Japanese entities to export control list | Sakshi
Sakshi News home page

‘డ్రాగన్ మార్క్’ప్రతీకారం: జపనీస్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం

Jun 30 2026 8:54 AM | Updated on Jun 30 2026 10:14 AM

China adds more Japanese entities to export control list
  • మరో 20 జపనీస్‌ సంస్థలపై చైనా ఎగుమతి ఆంక్షలు
  • జాబితాలో రక్షణ రంగ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు
  • తైవాన్ వివాదంలో జపాన్ ప్రధాని సనాయే తకైచీ తీవ్ర వ్యాఖ్యలు
     

బీజింగ్: జపాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసే లక్ష్యంతో చైనా మరోమారు కఠిన చర్యలకు దిగింది. ఇరుదేశాల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం మరింత ముదిరింది. జపాన్‌కు చెందిన మరో 20 ప్రైవేట్ సంస్థలతో పాటు పలు పరిశోధనా కేంద్రాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా నిఘా, ఎగుమతి ఆంక్షలను ప్రకటించింది. చైనా తయారీ వస్తువులు, సాంకేతికత జపాన్ సైనిక బలాన్ని పెంచడానికి ఉపయోగపడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజింగ్ స్పష్టం చేసింది.

ఈ తాజా ఆంక్షల జాబితాలో జపాన్ రక్షణ రంగానికి యుద్ధనౌకలను సరఫరా చేసే మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలు, జపాన్ స్వయంరక్షణ దళాలు, తీరరక్షక దళాలకు సేవలందించే నిక్కో టోక్కి వంటి కీలక సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు నిర్మాణ రంగ పరికరాల తయారీ సంస్థ కొమాట్సు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ వంటి పరిశోధనా కేంద్రాలపైనా చైనా నిషేధం విధించింది. దుర్వినియోగమయ్యే (డ్యూయల్-యూజ్) ముడిసరుకులు, రేర్ ఎర్త్స్, బ్యాటరీలు, చిప్ తయారీ పరికరాలు ఈ సంస్థలకు అందకుండా చైనా అడ్డుకోనుంది. వీటితో పాటు డ్రోన్లు, అణు ఇంధన రంగాలకు చెందిన మరో 20 జపనీస్ సంస్థలను చైనా ప్రత్యేక నిఘా జాబితాలో చేర్చింది.

తైవాన్ సంక్షోభంలో జపాన్ కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని జపాన్ ప్రధాని సనాయే తకైచీ  చేసిన వ్యాఖ్యలు బీజింగ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీనికి ప్రతీకారంగానే చైనా విమాన సర్వీసులను తగ్గించడమే కాకుండా, రేర్ ఎర్త్స్ ఎగుమతులను నిలిపివేస్తూ జపాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. తాజాగా చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కశ్మీర్‌లో కలకలం: పోలియో ప్రకటనపై పాక్‌ నినాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement