మందుల్లేకుండా కేన్సర్‌ చికిత్స!  | Cancer treatment without drugs says Technion University scientists | Sakshi
Sakshi News home page

మందుల్లేకుండా కేన్సర్‌ చికిత్స! 

Jun 13 2026 4:35 AM | Updated on Jun 13 2026 4:35 AM

Cancer treatment without drugs says Technion University scientists

నానో కణాలతో సాధ్యమంటున్న శాస్త్రవేత్తలు

ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం 

రొమ్ము కేన్సర్‌ కణితి పెరుగుదల స్టాప్‌! 

ఇజ్రాయెలీ శాస్త్రవేత్తల ఘనత

మందుల్లేకుండా కేన్సర్‌ను నయం చేస్తానని ఎవరైనా చెప్పారనుకోండి.. అస్సలు నమ్మబుద్ధి కాదు. అయితే ఇప్పటికిప్పుడు కాదు కానీ.. భవిష్యత్తులో ఈ అద్భుతం సాధ్యమే అంటోంది టెక్‌నియాన్‌ విశ్వవిద్యాలయం. ఇజ్రాయెల్‌లోని ఈ సంస్థ ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిచ్చాయి. నానో స్థాయి గుళికలతో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కఠినమైన ట్రిపుల్‌ నెగటివ్‌ రొమ్ము కేన్సర్‌ కణితి పెరుగుదల మందగించినట్లు స్పష్టమైంది.  

కేన్సర్‌ బారిన పడితే మరణం తథ్యమన్న కాలం ఎప్పుడో పోయింది. కానీ.. పూర్తిస్థాయి చికిత్స కూడా ఇప్పటివరకూ అందుబాటులో లేదు. కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియేషన్‌ వంటి సంప్రదాయ పద్ధతులతో మనిషి జీవితకాలాన్ని గణనీయంగా పెంచుకునే వీలైతే ఉంది. కానీ.. వీటితో దు్రష్పభావాలు చాలా ఎక్కువ. టెక్‌నియాన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయగల సామర్థ్యమున్నవి. అత్యాధునిక నానో కణాలను తయారు చేసిన వీరు చుక్క మందు కూడా ఇవ్వకుండానే ట్రిపుల్‌ నెగటివ్‌ రొమ్ము కేన్సర్‌ కణితి పెరుగుదలను నిలిపివేయగలిగారు.  

ఇదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే కేన్సర్‌ కణాలు మన రోగ నిరోధక వ్యవస్థను ఏమార్చేందుకు వేసే ఎత్తుల గురించి అర్థం చేసుకోవాలి. శరీరంలోకి చేరే హానికారక సూక్ష్మజీవులతోపాటు అదుపు తప్పిన కణాలను కూడా ఏరి వేసేందుకు రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని రకాల కణాలు నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. వీటిని టీ–సెల్స్‌ అంటారు. 

కేన్సర్‌ కణాలు రోగ నిరోధక వ్యవస్థ కళ్ల నుంచి తప్పించుకునేందుకు రకరకాల వ్యూహాలను అనుసరిస్తూంటుంది. ఇందులో భాగంగా కొన్ని రకాల తెల్ల రక్త కణాలను హైజాక్‌ చేసి కణితి పెరిగేందుకు ఉపయోగించుకుంటాయి. అంతేకాకుండా... రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్‌ కణాలను గుర్తించకుండా చేస్తుంటాయి. టెక్‌నియాన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ హైజాకింగ్‌ను లక్ష్యంగా చేసుకుని తమ చికిత్స పద్ధతిని అభివృద్ధి చేశారు. 

కణితి చుట్టూ రక్షణ కవచంగా... 
టెక్‌నియాన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసిన నానో కణాలను ఎంపీసోమ్స్‌ అని పిలుస్తున్నారు. కణితిని అతుక్కునేందుకు ఇవి కేన్సర్‌ కణాలు హైజాక్‌ చేసిన తెల్ల రక్త కణాలతో పోటీపడతాయి. తద్వారా కణితికి ఒక రక్షణ కవచంగా ఏర్పడి అది మరింత పెరగకుండా నిరోధిస్తాయి. కేన్సర్‌ కణాలపై, ప్రీ క్లినికల్‌ మౌస్‌ మోడళ్లలోనూ ఈ నానో కణాలను వాడినప్పుడు అవి కణితి చుట్టూ అసాధారణ స్థాయిలో గుమికూడినట్లు, పెరుగుదలను నిరోధించినట్లు స్పష్టమైంది. ఈ ఎంపీసోమ్స్‌ను సులువుగా తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. 

నిమిషానికి 20 మిల్లీలీటర్ల నానో కణాలను అంటే గంటకు సుమారు 1.2 లీటర్లు తయారు చేయగలమని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ఓఫ్రీ విజెన్‌బ్లిట్‌ తెలిపారు. పైగా వీటి తయారీకి వాడిన పదార్థాలు సురక్షితమైనవని ఎఫ్‌డీఏ సైతం ‘జనరలీ రికగ్నైజ్డ్‌ యాస్‌ సేఫ్‌’గా గుర్తించినవి కావడం గమనార్హం. ట్రిపుల్‌ నెగటివ్‌ రొమ్ము కేన్సర్‌ సంప్రదాయ చికత్స పద్ధతులకు సులువుగా లొంగదని, ఎంపీసోమ్స్‌తో తాము కణితి పెరుగుదలను నిరోధించడం కేన్సర్‌ చికిత్సలో చాలా పెద్ద మార్పు అని చెప్పారు. పరిశోధన ఫలితాలు ఏసీఎస్‌ నానో జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 
   
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement