డాక్టర్ గారు, నా రెండేళ్ల బాబుకు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. చాలాసార్లు యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి వస్తోంది. అతని రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?
– రమణి, నెల్లూరు.
ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. రెండు సంవత్సరాల వయసులో పిల్లలకు సంవత్సరానికి ఆరు నుంచి పదిసార్లు జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమే. ఇది ఇమ్యూనిటీ బలహీనంగా ఉందని అర్థం కాదు. ఈ వయసులోనే పిల్లల రోగనిరోధక వ్యవస్థ వివిధ సూక్ష్మక్రిములను ఎదుర్కొంటూ క్రమంగా బలపడుతుంది.
అయితే తరచుగా యాంటీబయాటిక్స్ అవసరం అవుతున్నాయనిపిస్తే, పిల్లల వైద్యుడిని సంప్రదించి నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమా లేదా అని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే చాలా జలుబులు, వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ ఉపయోగం ఉండదు. అందుకే, వారి ఇమ్యూనిటీ పెంచే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి 7 బంగారు సూత్రాలు ఉన్నాయి.
1. రంగురంగుల ఆహారం
ప్రతి రోజు పిల్లల ప్లేట్‌లో వివిధ రంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా చూడండి. పిల్లల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సమతుల్య ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బొప్పాయి, జామ, నారింజ, క్యారట్, టొమాటో, పాలకూర వంటి పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చాలి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందించి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
2. ప్రొటీన్ తప్పనిసరి
రోగనిరోధక కణాలు, యాంటీబాడీలు తయారవ్వడానికి ప్రొటీన్ కీలకం. గుడ్లు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, చికెన్ లేదా చేపలు వంటి ప్రోటీన్ పదార్థాలు తీసుకోవడం అవసరం.
3. తగినంత నిద్ర
నిద్రలోనే శరీరం తనను తాను పునరుద్ధరించుకుని రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకుంటుంది. అందుకే,
రెండేళ్ల పిల్లలకు రోజుకు 11 నుంచి 14 గంటల నిద్ర తప్పనిసరి.
4. బయట ఆడుకోవడం
ప్రతిరోజూ కనీసం గంటసేపు బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. సూర్యరశ్మి ద్వారా విటమిన్–డి లభించడంతో పాటు శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన ఎదుగుదల, మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తుంది.
5. అన్ని టీకాలు సమయానికి వేయించండి
టీకాలు పిల్లల శరీరానికి వివిధ వ్యాధులను ఎదుర్కోవడం నేర్పించే రక్షణ కవచంలాంటివి. అన్ని టీకాలను సమయానికి వేయించడం కూడా చాలా అవసరం. దీంతో అనేక తీవ్రమైన అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
6. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండి
చాక్లెట్లు, చిప్స్, కూల్‌డ్రింక్స్, ప్యాకెట్ ఫుడ్స్ వంటి జంక్ ఫుడ్‌ను పరిమితం చేయాలి. కడుపు నిండటం ఒకటి అయితే, శరీరానికి అవసరమైన పోషకాలు అందడం మరొకటి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తుంచుకోవాలి.
7. చేతుల పరిశుభ్రత అలవాటు చేయండి
అనేక ఇన్ఫెక్షన్లు చేతుల ద్వారా వ్యాపిస్తాయి. అందుకే, చిన్నప్పటి నుంచే పరిశుభ్రతను నేర్పించాలి. భోజనం ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి.
అయితే సంవత్సరానికి పదిసార్లకుపైగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, తరచూ న్యూమోనియా బారిన పడటం, బరువు సరిగా పెరగకపోవడం, నోటిలో పదేపదే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం లేదా తరచూ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే ప్రత్యేక ఇమ్యూనిటీ పరీక్షలు చేయవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇమ్యూనిటీని ఒక్కసారిగా పెంచే మంత్రం లాంటి సిరప్ లేదా టానిక్ ఏదీ లేదు. సమతుల ఆహారం, తగిన నిద్ర, పూర్తి టీకాలు, శారీరక చలనం, పరిశుభ్రత వంటి ఆరోగ్యకరమైన అలవాట్లే పిల్లల రోగనిరోధక శక్తిని సహజంగా బలపరుస్తాయి.
డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్,
పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్


