అదృష్టం అంటే ఇదే.. వారం వ్యవధిలోనే రెండు లాటరీలు! | Canadian Woman Wins Two Lottery Jackpots in Just One Week | Sakshi
Sakshi News home page

అదృష్టం అంటే ఇదే.. వారం వ్యవధిలోనే రెండు లాటరీలు!

Jun 14 2026 4:28 AM | Updated on Jun 14 2026 4:37 AM

Canadian Woman Wins Two Lottery Jackpots in Just One Week

అదృష్టం ఒక్కసారి తలుపు తట్టడమే చాలా మందికి జీవితంలో మరపురాని అనుభవం. కానీ కెనడాకు చెందిన ఓ మహిళకు మాత్రం వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు అదృష్టం వరించింది. రెండు వేర్వేరు లాటరీల్లో భారీ మొత్తాలను గెలుచుకుని ఆమె వార్తల్లో నిలిచారు.

కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో ఉన్న మిస్సిసాగా నగరానికి చెందిన ట్రాంగ్ ఫామ్ తన నలుగురు సహోద్యోగులతో కలిసి గత ఏడాది ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆ టికెట్‌కు ఏకంగా 60 మిలియన్ కెనడియన్ డాలర్ల జాక్‌పాట్ తగిలింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.407 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ భారీ ప్రైజ్ మొత్తాన్ని ఐదుగురు సభ్యులు సమానంగా పంచుకోవడంతో ట్రాంగ్‌కు కూడా గణనీయమైన మొత్తం లభించింది.

అయితే ఆమె అదృష్టం అక్కడితో ఆగలేదు. తొలి లాటరీ గెలిచిన కేవలం వారం రోజులకే ట్రాంగ్ మరోసారి స్క్రాచ్ కార్డ్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆశ్చర్యకరంగా ఈ టికెట్‌కు కూడా జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆమెకు మరో 2,50,000 కెనడియన్ డాలర్లు లభించాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.60 కోట్లకు సమానం.

ఈ రెండో లాటరీని ఆమె వ్యక్తిగతంగా కొనుగోలు చేశారా, లేక మరెవరితోనైనా కలిసి తీసుకున్నారా అనే వివరాలు వెల్లడికాలేదు. అయితే వారం వ్యవధిలోనే రెండు భారీ లాటరీలు గెలుచుకోవడం అత్యంత అరుదైన ఘటనగా నిలిచింది. సాధారణంగా జీవితకాలంలో ఒక్కసారి కూడా లాటరీ గెలవడం కష్టమని భావించే పరిస్థితుల్లో, ట్రాంగ్ వరుసగా రెండుసార్లు జాక్‌పాట్ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ ఘటన కెనడా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లాటరీ నిపుణులు కూడా ఇలాంటి సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతాయని పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను 'లక్కీ లేడీ'గా అభివర్ణిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తంగా ట్రాంగ్ ఫామ్ కథ అదృష్టం ఎప్పుడు, ఎలా వరుస్తుందో చెప్పలేమనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement