అమెరికాలో బోయింగ్‌ 777  ప్రమాదకరమైన విన్యాసం  | Boeing 777 nearly clipped the ground during an unusually low flyover in Texas | Sakshi
Sakshi News home page

అమెరికాలో బోయింగ్‌ 777  ప్రమాదకరమైన విన్యాసం 

Jun 27 2026 5:17 AM | Updated on Jun 27 2026 5:17 AM

Boeing 777 nearly clipped the ground during an unusually low flyover in Texas

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మార్బుల్‌ ఫాల్స్‌ సమీపంలోని హార్స్‌షూ బే రిసార్ట్‌ జెట్‌ సెంటర్‌ వద్ద ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కార్గో కోసం సిద్ధం చేసిన బోయింగ్‌ 777–200ఎల్‌ఆర్‌ విమానం అతి తక్కువ ఎత్తులో విన్యాసం చేసింది. నేలకు కొన్ని అడుగుల ఎత్తులో రెక్కను దాదాపు నేలకు తాకించినంత ప్రమాదకర కోణంలో మలుపు తిరిగింది. జూన్‌ 24 బుధవారం నాడు జరిగిన ఘటన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది.

 విమానం కుడి రెక్క నేలకు కొన్ని అంగుళాల దూరంలో వెళుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫుటేజ్‌ ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్‌ అయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇంత పెద్ద విమానానికి ఇలాంటి విన్యాసాలు అత్యంత ప్రమాదకరమని విమానయాన పరిశీలకులు అభివరి్ణంచారు. ఈ ఘటనలో ఆ విమానయాన సంస్థ ప్రమేయం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. 

అయితే, ఆ విమానం ఇంకా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సేవలోకి ప్రవేశించలేదని స్పష్టమైంది. ఆ విమానం యజమాని అయిన టెక్సాస్‌ ఆధారిత లీజింగ్‌ సంస్థ జెట్రాన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనతో ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు గానీ, ఆ విమానయాన సంస్థ పైలట్లకు గానీ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ విమానం తమ యాజమాన్యంలోనే ఉందని, ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు ఇవ్వడానికి ముందు పరీక్షల్లో భాగంగా దీనిని నడుపుతున్నామని ఆ సంస్థ తెలిపింది. పరీక్షల్లో డెలివరీకి ముందు ఈ తక్కువ ఎత్తు ప్రయాణం ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని వెల్లడించింది. 

నేలను తాకినట్లు ఎటువంటి నిర్ధారణ కాలేదని, విమానం తన ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేసి, ఆ తర్వాత ఫోర్ట్‌ వర్త్‌ అలయన్స్‌ విమానాశ్రయంలో ఎటువంటి సంఘటన లేకుండా ల్యాండ్‌ అయిందని వెల్లడించింది. పరీక్షల సమయంలో తక్కువ ఎత్తులో ప్రయాణించడం సాధారణం. అయినప్పటికీ, అవి సాధారణంగా కట్టుదిట్టమైన నియంత్రణ విధానాలతో, స్పష్టమైన భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తారు. రెక్కల వెడల్పు 200 అడుగులకు మించి ఉన్న విమానాలు తక్కువ ఎత్తులో మరింత ప్రమాదకరంగా మారతాయని విమానయాన నిపుణులు పేర్కొంటున్నారు. గాలి, నియంత్రణలో చిన్న మార్పులు కూడా ప్రమాద కారకం అవుతాయని హెచ్చరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement