ఆరుగురి దుర్మరణం
ఆంట్‌వెర్ప్: బెల్జియంలోని ఆంట్‌వెర్ప్ నగర శివారులోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. షెల్డర్ నది సమీపంలోని లింకెరోవర్ జిల్లా పరిధిలోని ఈ పది అంతస్తుల భవంతి గ్రౌండ్ ఫ్లోర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా బుధవారం ఉదయం 10 గంటలకు ఎనిమిదో అంతస్తులో అనూహ్యంగా హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ భవంతిలోని 80 ఫ్లాట్‌లలో 200 మందికిపైగా నివసిస్తున్నారు.
ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టంగా అలుముకున్న పొగతో భవనంలో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భవంతిలోని పై అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ముఖ్యంగా పదో అంతస్తు దారుణంగా కాలిపోయింది. విషయం తెల్సి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అగ్నికీలలను ఆర్పే ప్రయత్నంచేశారు.
అత్యంత ఎత్తులో మంటలు చెలరేగుతుండటంతో అగ్నికీలలను ఆర్పడం ఫైర్ విభాగ సిబ్బందికి సమస్యగా మారింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎనిమిదో అంతస్తులో దట్టంగా కమ్ముకున్న పొగ మధ్యలోంచి ఒకతను బయటకు వేలాడుతూ రక్షించండి అని అరుస్తున్న వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమయస్ఫూర్తితో ఆయన నెమ్మదిగా పక్కకు జరిగి వేరే కిటికీ ద్వారా బయటపడ్డారు.


