బీబీసీ ,అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు క్షమాపణలు తెలిపింది. క్యాపిటల్ హిల్స్ పై దాడి జరిగిన సందర్భంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్లు అంగీకరించింది. అందుకు క్షమాపణలు కోరుతూ బీబీసీ ఛైర్మన్ వైట్ హౌస్‌కు లేఖ పంపారు. అయితే ట్రంప్ పరువునష్టం దావా వేసిన ఒక బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇవ్వడానికి మాత్రం బీబీసీ అంగీకరించలేదు.
2021లో క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్ధతు దారులు దాడి చేశారు. ఆ సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని మరో అర్థం వచ్చేలా ఎడిట్ చేసి బీబీసీ ప్రసారం చేసింది. అయితే తనపై తప్పుడు ప్రసారం చేసినందుకు గానూ బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ట్రంప్ బీబీసీకీ లేఖ పంపారు. దానికి శుక్రవారం డెడ్ లైన్ విధించారు. దీంతో బీబీసీ ఛైర్మన్ సమీర్ షా క్షమాపణలు కోరుతూ వైట్ హౌస్ కు లేఖ పంపారు. ట్రంప్ ప్రసంగం చేసిన వీడియో క్లిప్‌ను సవరించినందుకు తీవ్రంగా విచారిస్తున్నామని తెలిపారు. మరోసారి ఆ కార్యక్రమాన్ని బీబీసీలో ప్రసారం చేయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కొంతమంది ఆ సంస్థకు చెందిన అధికారులు ఇది వరకే రాజీనామా చేశారు.
అసలేం జరిగింది
2021లో క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి సమయంలో ట్రంప్ సూమారు గంట పాటు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి బీబీసీ తన పనోరమ డ్యాకుమెంటరీలో ప్రసారం చేసింది. అందులో " మనం క్యాపిటల్ హిల్ కు వెళుతున్నాం. మీతో పాటు నేను వస్తున్నా. మనం తీవ్రంగా పోరాడుదాం" అని ట్రంప్ అన్నట్లు చూపించింది. అయితే వాస్తవానికి ఆ వీడియోలో శాంతియుతంగా పోరాడుదాం అన్న వ్యాఖ్యలను వక్రీకరించించి ప్రసారం చేసింది. దీంతో ట్రంప్ 1బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంపై ట్రంప్ కు క్షమాపణలు చెప్పిన బీబీసీ పరిహారం మాత్రం చెల్లించలేదు.


