ఇస్లామాబాద్: సర్భ్‌జిత్ కౌర్ అనే మహిళ సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే ఒక పాకిస్థానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆ మహిళ పేరుతో వచ్చిన ఓ ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లా ఆమ్నీపూర్ గ్రామానికి చెందిన సర్బ్‌జిత్ కౌర్.. సిక్కుల మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి గతేడాది నవంబర్‌లో వాఘబార్డర్ మీదుగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. ఆ తీర్థయాత్రకోసం దాదాపు 2 వేల మంది భక్తులు పాకిస్థాన్ వెళ్లగా అందరూ తిరిగి వచ్చారు. అయితే సర్బ్‌జిత్ రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించగా వారు విచారించారు. అప్పుడు ఆమె అక్కడే నశీర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. తాజాగా ఇప్పుడు ఆమె పేరుతో ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది.
అందులో అక్కడ తాను అస్సలు బాగాలేనని తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతని కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేస్తోందని అన్నట్లు ఉంది. దయచేసి తనను తిరిగి ఇండియా తీసుకెళ్లాలని తన భారత్‌లో ఎటువంటి హాని చేయనని ఆమె అందులో అన్నారు. తన పిల్లలను చూడాలని ఉందని ఎంతోమందికి లక్షల రుపాయలు దానంగా ఇచ్చిన తను ఇప్పుడు డబ్బుల కోసం వేడుకోవాల్సి వస్తోందని ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఆడియో క్లిప్ సర్బ్‌జిత్ కౌర్‌కు చెందిందా కాదా అనే విషయం పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.
అయితే సర్బ్‌జిత్ కౌర్ వివాహం అనంతరం అక్కడి పోలీసులు వారిపై దాడి చేసి పెళ్లిని రద్దు చేసుకోవాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన లాహెర్ కోర్టు సర్భ్‌జిత్‌ని అక్కడి ప్రభుత్వ వసతి గృహానికి తరలించినట్లు అక్కడి తెలిపారు. అయితే కౌర్‌ను ఇది వరకే పాకిస్థాన్ నుంచి పంపించాలని ప్రయత్నించగా వాఘా బార్డర్ మూసివేయడంతో అది సాధ్యపడలేదని అక్కడి అధికారులు అన్నారు.


