
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒక బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం తీవ్ర నిరసనలకు దారి తీసింది. గిరిజన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా జమ్ము స్టూడెంట్స్ బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఆదివాసీ గిరిజనులకు, ఇక్కడ స్థిరపడిన బెంగాలీవారికి మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించినప్పటికీ ఘర్షణలు కొనసాగి, ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.
భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లోని ఖగ్రాచారీ జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన దరిమిలా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఈ హింసాకాండలో 13 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని ఢాకాలోని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖగ్రాచారీ జిల్లా కేంద్రంలో తొలుత హింస చెలరేగింది. అక్కడి చక్మా, మర్మ అనే ఆదివాసీ తెగలకు చెందినవారు శనివారం టైర్లు కాల్చివేస్తూ, చెట్ల కొమ్మలు, ఇటుకలను అడ్డుగా పెట్టి రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులతో పాటు సైనిక, పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)దళాలు గస్తీ నిర్వహించాయి. అయినప్పటికీ హింస చెలరేగింది.
బాధిత బాలిక ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఒక బెంగాలీ యువకుడిని అరెస్టు చేశారు. అతను అత్యాచారం చేసిన వారిలో ఒకడని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆ యువకుడిని విచారిస్తున్నారు. కాగా గుయిమారాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారని, వారి మృతదేహాలను ఖగ్రాచారీ ఆస్పత్రిలో ఉంచారని పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ విలేకరులకు తెలిపారు.