సాక్షి,సిటీ బ్యూరో: మహా హైదరాబాద్ పరిధిలో తాగునీటి సరఫరాలో లోప్రెషర్’(తక్కువ పీడనం)పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వేసవి ఉష్ణతాపానికి తాగునీటి అవసరాలు పెరుగుతుండగా, మరోవైపు కొందరు నల్లాలకు అక్రమంగా వి ద్యుత్ మోటార్లు బిగిస్తున్నారు. నీటిని స్పీడ్‌గా లాగేయడం సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగునీటి డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యత దెబ్బతింటోంది. ప్రధాన ప్రాంతాల నుంచి శివారు కాలనీల వరకు ‘లోప్రెషర్’సమస్య వెంటాడుతోంది. ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న కాలనీల చివరి ఇళ్లకు నీరు అందని పరిస్థితి నెలకొంది. అంబర్‌పేట్, ఖైరతాబాద్, బాలానగర్, ఉప్పల్ కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ పరిధిలోని కొన్ని కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. నీరు సరిగా అందక నగరవాసులు అల్లాడుతున్నారు.
అక్రమ మోటార్ల వినియోగం..
నీటి సరఫరా సమయంలో నల్లాలకు నేరుగా ఎలక్ట్రిక్ మోటార్లు బిగించి నీటిని లాగేస్తుండటంతో పక్కన ఉన్న ఇళ్లకు ప్రెషర్ తగ్గి నీరు అందడం లేదు. నగరవ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటి వేల సంఖ్యలో బోర్లు ఎండిపోవడంతో నివాస సముదాయాలు నల్లా నీటి సరఫరాపైనే ఆధారపడుతున్నాయి. సాధారణ గృహ అవసరాలకు వాడే మోటార్లతోపాటు మరింత వేగంగా నీటిని తోడేసేందుకు హై–స్పీడ్, ఆటోమేటిక్ మోటార్లు, కొన్నిచోట్ల వ్యవసాయ రంగానికి చెందిన హై–హార్స్‌పవర్ (2 హెచ్‌పీ అంతకంటే ఎక్కువ) సామర్థ్యం ఉన్న మోటార్లను కూడా అక్రమంగా అమర్చుతున్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన విజిలెన్స్
జలమండలి విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. అక్రమంగా పైపులకు మోటార్లు బిగించేవారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. గత పక్షం రోజుల్లో మెట్రో కస్టమర్ కేర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఽఆధారంగా దాడులు చేయగా పదుల సంఖ్యలో అక్రమ మోటార్ల వ్యవహారం బయటపడింది. రామంతాపూర్ ఉప్పల్, శివనగర్, ఉప్పర్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్ తదితర ప్రాంతాల్లో నల్లాలకు అక్రమంగా బిగించిన మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో తాగునీటి సరఫరా ఇలా .. (ఎంజీడీల్లో)
మొత్తం సరఫరా 582.86
కోర్ సిటీ 221.52
జీహెచ్‌ఎంసీ 203.33
ఓఆర్‌ఆర్ 86.74
ట్రాన్స్‌మిషన్ 49.27
ఆర్‌డబ్ల్యూఎస్ 22.00
ఎత్తైన ప్రాంతాలకు అందని నీరు
మరోవైపు నల్లాలకు అక్రమంగా మోటార్లు
రంగంలో దిగిన విజిలెన్స్ బృందాలు


