సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
మూసాపేట: మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డులోని కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నాలుగు జట్లుగా విడిపోయి డాక్యుమెంట్ రైటర్‌ను, సబ్ రిజిస్ట్రార్ సిబ్బందిని, సబ్ రిజిస్ట్రార్‌ను విచారించారు. తమపై ఫిర్యాదులు అందడంతో వారి ఆదేశాల మేరకు ఆకస్మిక దాడులను నిర్వహించామని రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. కొన్ని అవకతవకలు ఉన్నాయని, కొన్ని డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ కె. వేణుగోపాల్ రెడ్డిని, సిబ్బందిని, డాక్యుమెంట్స్ రైటర్స్‌ని విచారిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి వరకు దాడులు కొనసాగాయి.
కుత్బుల్లాపూర్‌లో..
సుభాష్‌నగర్: సూరారంలోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల సమయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సోదాలు జరిపారు. ముందుగా గేట్లను మూసివేసి కార్యాలయంలో 100 మందికి పైగా ఉన్న వారందరిని ప్రశ్నించారు. వీరిలో 15 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లను ప్రశ్నించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లతో కలిసి ప్రతిరోజు 144 స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగే కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అదనంగా డబ్బులు తీసుకుంటూ పని చేస్తున్నారని పలు ఫిర్యాదులు రావడంతో సోదాలు జరిపామని తెలిపారు. డాక్యు మెంటర్ల వద్ద అదనంగా కొన్ని డాక్యు మెంట్లు దొరికాయని, వాటిపైన విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఒకవేళ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలితే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఆయన పేర్కొన్నారు.


