కాలుష్య కష్టాలు..ఎవరూ పట్టించుకోరు
● నగరంలో తీరుమార్చుకోని పరిశ్రమలు
● ఘాటైన వాసనలు, రసాయనాల పారబోతపై స్థానికుల ఫిర్యాదులు
● అధికారుల తీరుపై ఆరోపణలు
సాక్షి, సిటీబ్యూరో: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాలు పర్యావరణ పరంగా తీవ్రంగా నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో గాలి, నీరు, భూమి కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు పరిశ్రమల కాలుష్యంపై ఫిర్యాదులు అందుతున్నప్పటికి పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా యథారాజ.. తథాప్రజ అన్నట్లు కాలుష్య ంలో కాలం వెళ్లదీయాల్సి వస్తోందని, ఆరోగ్యం చెడిపోయి ఆసుపత్రులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం అవస్థలు
పటాన్‌చెరు, రామచంద్రాపురం, బొల్లారం, జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్, పాశమైలారం, బాచుపల్లి, సనత్‌నగర్, చర్లపల్లి, కాటేదాన్, నాచారం, కాజీపూర్, కిష్టాయిపల్లి, అమీన్‌పూర్, బాచుపల్లి, నిజాంపేట్ పరిశర ప్రాంతల్లో కాలుష్యకారక పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన రెడ్ కేటగిరీ పరిశ్రమలు వేల సంఖ్యలో ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గుర్తించింది. నక్కవాగు, అమీన్‌పూర్ చెరువు, సుల్తాన్‌పూర్, తదితర ప్రాంతాల్లో చెరువుల్లో ప్రమాదకర స్థాయిలో భారీ లోహాలు, ద్రావణాలు, రసాయన అవశేషాలు ఉన్నట్లు తేలింది. రాత్రి వేళల్లో పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా వరద కాల్వల్లో విడుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఘాటైన వాసనకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల ప్రభావంతో చెరువుల్లో చేపలు, ఇతర జల చరాలు మృత్యువాతపడుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నాచారం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యాన్ని తగ్గించడం, పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పీఎం 2.5, పీఎం10, సల్ఫర్‌డయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్, కార్బన్ మోనాకై ్సడ్, భారీ లోహాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి ప్రధానంగా పారిశ్రామిక ఉద్గారాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఆపై వాహనాలు, నిర్మాణ వ్యర్థాలు గాలిలో ధూళి కణాల సంఖ్య పెరగడానికి సహకరిస్తున్నాయి.
బల్క్‌డ్రగ్స్ పరిశ్రమలతో ప్రమాదం
ప్రపంచ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో హైదరాబాద్ వాటా సుమారు 40 శాతం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిశ్రమలతో విపరీతమైన కాలుష్యం వెలువడుతోందని అభిప్రాయడపతున్నారు. కాలుష్య వ్యర్థాలను సక్రమ పద్ధతిలో ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలించడంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ట్యాంకర్లతో తరలించి మూసీ, వరద కాల్వలు, ఇతర నిర్జన ప్రదేశాల్లో పారబోస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అమీన్‌పూర్, నిజాంపేట్, బాచుపల్లి, పాశమైలారం తదితర ప్రాంతాల్లో శ్వాసకోశ, చర్మ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అధికారుల తీరుపై ఆరోపణలు
జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి, బాచుపల్లి, పటాన్‌చెరు, పాశమైలారం తదతర ప్రాంతల్లో కాలుష్య వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా పరిశ్రమలు ఆరుబయట పారబోస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నా పీసీబీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్ని దఫాలు ఫిర్యాదులు ఇచ్చినా వారి నుంచి ఆశించిన మేరకు స్పందన కనిపించడం లేదంటున్నారు. అడపాదడపా తనికీలు చేపడుతూ మమ అనిపించేస్తున్నారన్నారంటున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే తాయిలాలకు ఆశపడి కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపిస్తున్నారు. పీసీబీలో సుమారు 10 నుంచి 15 మంది సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.


