త్రాసు.. తిర‘కాసు’
● పదోన్నతులు, పోస్టింగ్‌ల్లో చేతివాటం
● రెగ్యులర్ కంట్రోలర్ లేక ఇష్టారాజ్యం
● ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి
● పట్టించుకోని సంబంధిత శాఖ మంత్రి
సాక్షి, సిటీబ్యూరో: తూనికలు, కొలతల శాఖలో తూకం మోసాలపై జరిమానాల వసూలుతో పాటు ఉద్యోగుల సీనియారిటీ నిర్ధారణ, పోస్టింగ్, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన రాజ్యమేలుతోంది. రాష్ట్ర శాఖకు రెగ్యులర్ కంట్రోలర్ పోస్ట్ ఉన్నా.. ప్రతిసారీ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ)గా నియమిస్తున్న తీరు చేతివాటం ప్రదర్శించే అక్రమ అధికారులకు కలిసివస్తోంది. ఇటీవల బదిలీపై వెళ్తున్న రాష్ట్ర కంట్రోలర్‌పై బాహాటంగానే స్వామి భక్తిని చాటుకున్న తూ.కొ. అధికారుల తీరు ఇందుకు బలం చేకూర్చుతోంది. గత కొనేళ్లుగా ఈ శాఖ పరిపాలన యంత్రాంగం తీరు నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది. అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ విచారణలు కొనసాగుతున్నా.. పనితీరు మాత్రం మెరుగుపడటం లేదు. ఇటీవల పరిపాలన విభాగం బాధ్యుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉద్యోగుల సీనియారిటీని తిమ్మినిబమ్మిని చేయడం.. తాజాగా న్యాయస్థానం సరిదిద్దేందుకు ఆదేశాలు ఇవ్వడం ఆ శాఖ పని తీరును బహిర్గతం చేస్తోంది. మరోవైపు కాంపౌండింగ్‌లో చేతివాటం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోంది. సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కంచే చేను మేస్తే..
తూ.కొ. శాఖలో పరిపాలన విభాగం కంచే చేను మేసే విధంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల క్రితం వరకు ఏసీ (అడ్మిన్) హెడ్ క్వార్టర్‌గా పనిచేసిన అధికారి తన స్వీయ పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాలో సీనియార్లను వెనక్కి నెట్టి తన పేరును పైవరసలోకి తెచ్చుకొని ఏకంగా రాష్ట్ర కంట్రోల్ ఆమోదం పొందటం విస్మయానికి గురి చేసింది. జాబితాలో వెనకబడిన అధికారి ఒకరు కోర్టును ఆశ్రయించి ఆదేశాలు పొందడంతో దిద్దుబాటుకు తూ.కొ.శాఖ తర్జనభర్జన పడుతోంది.
మచ్చుకు కొన్ని ఉల్లంఘనలు..
● కరీంనగర్ డీఎల్‌ఎంను నిజాబాబాద్ ఏసీగా పదోన్నతి కల్పించారు. సదరు ఉద్యోగి గతంలో గుర్తింపు లేని రాజస్థ్రాన్ రాష్ట్రానికి చెందిన డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ధ్రువీకణ సమర్పించి ఇన్‌స్పెక్టర్ డీఎల్‌ఎంగా పదోన్నతి పొందినట్లు ఆరోపణలున్నాయి.
● బదిలీల నిషేధ కాలంలో నల్లగొండ డీఎల్‌ఎంను మేడ్చల్‌కు బదిలీ చేసి తాజాగా ఏసీగా పదోన్నతి కల్పించి రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు.
● పెద్దపల్లి ఇన్‌స్పెక్టర్‌ను హన్మకొండ డీఎల్‌ఎంఓగా పదోన్నతి కల్పించారు. సదరు ఉద్యోగిపై ఏసీబీ కేసు పెండింగ్‌లో ఉంది.
● మహబూబాబాద్ ఇన్‌స్పెక్టర్‌కు ఆదిలాబాద్ డీఎల్‌ఎంఓగా పదోన్నతి కల్పించారు. శాఖాపరమైన పార్ట్–2 పరీక్ష పాస్ కాకముందే పదోన్నతి లభించింది.
● కొత్తగూడెం ఇన్‌స్పెక్టర్‌కు వరంగల్ డీఎల్‌ఎంఓగా పదోన్నతి లభించింది. సదరు ఉద్యోగిపై 2022 నుంచి విజిలెన్స్ విచారణ పెండింగ్‌లో ఉంది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
తూ.కొ.శాఖలో నిబంధనలు బేఖాతరు
అంతా ఇష్టారాజ్యమే..
ఈ ఏడాది కాలంలో జరిగిన పలు పదోన్నతులు, పోస్టింగ్, బదిలీల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలున్నాయి. కొత్త పోస్టింగ్‌లో చేరిన కొద్ది నెలలకు కొందరిని కోరుకున్న స్థానాలకు బదిలీ చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఇటీవల వరకు ఇన్‌చార్జి ఏసీ అడ్మిన్ హెడ్ క్వార్టర్‌గా వ్యవహరించిన అధికారి ఒకరు.. రెగ్యులర్ అధికారి రావడంతో బాధ్యతల నుంచి తప్పుకొన్నా వరసగా రెండు నెలల పాటు చాంబర్ వదలకుండా కొన్ని పోస్టింగ్‌ల్లో, పదోన్నతుల్లో సైతం చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి.


