గేటెడ్ ఓటర్లకు గాలం!
జూబ్లీహిల్స్ జోరందుకున్న ఎన్నికల ప్రచారం
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. శాసన సభ ఉప ఎన్నికకు ఇంకో వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు జోరు పెంచారు. సామాజిక సమీకరణాల ఆధారంగానే ప్రచారం కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బస్తీలతో పాటు ఉన్నత వర్గాల ఓటర్లు కూడా ఉండటంతో అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. షేక్‌పేట, వెంగళరావునగర్, బోరబండ వంటి ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలలో విభాగాల వారీగా తాయిలాలతో గంపగుత్తగా ఓట్లర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
వీకెండ్, కిట్టీ పార్టీలు..
జూబ్లీహిల్స్‌లో 3.98 లక్షల మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నిక కావడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రధానంగా నియోజకవర్గంలోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల ఓటర్లకు గాలం వేస్తున్నారు. తటస్థులను తమ వైపు తిప్పుకొ నేందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో వీకెండ్ పార్టీలు, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కిట్టీ పార్టీలను నిర్వహిస్తున్నాయి.
సంఘాలలో సీసీ టీవీలు..
జూబ్లీహిల్స్ బరిలో దిగిన అభ్యర్థుల తరఫున ప్రచార బాధ్యతలు తలకెత్తుకున్న మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల నివాసిత సంఘాలు, కాలనీల సంక్షేమ సమితిల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా సంఘాలకు అవసరమైన వస్తువులు ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. తాయిలాలతో వారిని ఆకర్షించే యత్నాలు చేస్తున్నారు. కాలనీలు, నివాసిత సంఘాల భద్రత కోసం ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరో గేటెడ్ కమ్యూనిటీలోని సీనియర్ సిటిజెన్ల ఓట్లను ఆకర్షించేందుకు ఆయా ఓటర్లకు యోగా, మెడిటేషన్ హాల్ వంటివి కట్టిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
అపార్ట్‌మెంట్లలో వీకెండ్, కిట్టీ పార్టీల నిర్వహణ
కాలనీలు, సంఘాలలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
గంపగుత్త ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థుల ఎత్తుగడ


