గోల్ఫ్ టోర్నీ నిర్వహణ ఎంతో గర్వకారణం
– మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి సిటీబ్యూరో: తొలిసారిగా భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక 60వ ఐజీఎఫ్‌ఆర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్ షిప్‌ను గచ్చిబౌలి పరిధిలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ వేదిక కావడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్ఫ్ కోర్సులు హైదరాబాద్‌లో ఉండడం ఎంతో సంతోషించదగిన అంశమని చెప్పారు. టూరిజం అభివృద్ధి క్రీడలతోనూ ముడిపడి ఉందని, ముఖ్యంగా విదేశీ పర్యాటకలకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు.
వారం రోజులు.. 24 దేశాలు.. 180 మంది క్రీడాకారులు
వారం రోజుల పాటు జరిగే గోల్ఫ్ చాంపియన్ షిప్‌లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. పలు సేవాకార్యక్రమాలను నిర్వహించే రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రోటారియన్స్ (ఐజీఎఫ్‌ఆర్) సహకారంతో ప్రసూతి, శిశు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతీ ఏడాది దీనిని నిర్వహిస్తోంది.


