
సమావేశంలో మాట్లాడుతున్న రాచకొండ సీపీ సుదీర్‌బాబు
ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్ల అరెస్టు
5 నాటు తుపాకులు, 18 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్ బాబు
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి అక్రమంగా తుపాకులు (తపంచాలు) తీసుకువచ్చి విక్రయించే ప్రయత్నం చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ పోలీసులు, బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 5 నాటు తుపాకులు, 18 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్‌బీనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నగరం జీనా ఇనాయత్ ఖాన్ కాలనీకి చెందిన మహ్మద్ జీషన్ అలియాస్ జీఖాన్ (28) 2016లో తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చి సంతోష్‌నగర్ రక్షాపురంలో నివాసం ఉంటున్నాడు. మహ్మద్ జీషన్ 2019లో సంతోష్ నగర్‌లో హెయిర్ సెలూన్ షాప్‌ను ఏర్పాటు చేశాడు. దీంతోపాటు నగరంలోని రక్షాపురం, గోల్కొండ, బాలాపూర్‌లో మరో మూడు హెయిర్ సెలూన్ షాపులను నడుపుతున్నాడు. సొంత గ్రామస్తుడైన తన స్నేహితుడు మహ్మద్ అమీర్ (24)ను నగరానికి తీసుకువచ్చి బాలాపూర్ ఎక్స్ రోడ్స్‌లోని జీషన్ హెయిర్ సెలూన్ షాప్‌లో పనిలో పెట్టాడు. మహ్మద్ జీషన్ మద్యం, విలాసవంతమైన జీవితానికి బానిసయ్యాడు.
హెయిర్ సెలూన్‌తో వచ్చే సంపాదన విలాసాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తక్కువ ధరకు దేశీయ ఆయుధాలను కొనుగోలు చేసి నగరంలో అవసరమైన వ్యక్తులకు అధిక ధరకు విక్రయించాలని పథకం వేశాడు. ఈ విషయాన్ని మహ్మద్ అమీర్‌కు తెలియజేయడంతో ఇందుకు అతను కూడా అంగీకరించాడు. జీషన్ ఉత్తర ప్రదేశ్‌లోని స్వగ్రామానికి చెందిన తన స్నేహితుడు అర్షి ఖాన్‌ను సంప్రదించాడు, అతను యూపీలోని రాంపూర్ ప్రాంతంలో అక్రమ తుపాకుల తయారీదారులతో సంబంధాలు కలిగి ఉన్నాడు. వారి ప్రణాళిక ప్రకారం కొన్ని రోజుల క్రితం వారు రాంపూర్ నగరానికి చెందిన అర్షి ఖాన్ నుంచి 5 రకాల తపంచాలను తకువ ధరకు కొనుగోలు చేశారు. హైదరాబాద్ నగరంలోని సంఘ వ్యతిరేక శక్తులకు తమ పరిచయాల ద్వారా ఒక్కటి రూ. 2 లక్షలకు విక్రయించడానికి తమ వద్ద ఉంచుకున్నారు.
ఈ మేరకు గురువారం ఉదయం జీషన్, అమీర్‌లు బాలాపూర్ సెలూన్‌లో తుపాకులు ఉంచడానికి వెళుతుండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్‌ఓటీ టీమ్, బాలాపూర్ పోలీసులతో కలిసి బాలాపూర్ పరిధిలోని రాయల్ కాలనీ వద్ద నిందితులను అడ్డగించి వారి వద్ద నుంచి 5 దేశీయ తపంచాలు, 18 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, అడిషనల్ డీసీపీ మహ్మద్ షాకిర్ హుస్సేన్, ఏసీపీ జానకిరెడ్డి పాల్గొన్నారు.

అక్రమ ఆయుధాలు

అక్రమ ఆయుధాలు